గత జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా మురికి నీటితో ఉన్న హుస్సేన్ సాగర్ ను మంచి నీటితో ఇంపుతానని, చుట్టూ ఆకాశహర్మ్యాలతో సాగర్ నీటిని కొబ్బరి నీటివలె చేస్తానని చెప్పిన కేసీఆర్ ఇప్పుడా విషయమే మరచిపోయారు. కానీ ప్రతి ఏటా సాగర్ శుద్ధి పేరుతో కోట్లాది రూపాయలను కాంట్రాక్టర్ల జేబులలో నింపుతున్నారు.
అట్లాగే హుస్సేన్ సాగర్ చుట్టూ 60 నుండి 100 అడుగుల ఎత్తైన లేక్ వ్యూ టవర్లు నిర్మించడం ద్వారా అందంగా తీర్చిదిద్దుతామని 2014లోనే ప్రకటించిన కేసీఆర్ ఇప్పటి వరకు కనీసం ప్రణాళికలు కూడా సిద్ధం చేయలేదు.
ఉమ్మడి రాష్ట్రంలో పునాది పడిన మెట్రో రైలు తమ ఘనతగా చెప్పుకొంటున్న కేసీఆర్ పాతబస్తీ వరకు ఆ రైల్ ఎందుకు వెళ్లడం లేదో చెప్పగలరా? జేబీఎస్ టెర్మినల్ ప్రారంభం సందర్భంగా పాతబస్తీకి ఏడాదిలోగా మెట్రో రైలు నడుస్తోందని ప్రకటించిన కేసీఆర్ కనీసం పనులు కూడా ప్రారంభించ లేదే? శంషాబాద్ విమానాశ్రయం వరకు పొడిగిస్తామని చెప్పిన ఆయన ఎందుకు ఆ ఊసెత్తడం లేదు?
హైదరాబాద్ ను విశ్వనగరంగా మారుస్తామని చెప్పుకొంటున్న నేతలు 450 ఏళ్ళ నగర చరిత్రకు సాక్షిగా ఉన్న పలు వారసత్వ భవనాలను కూల్చివేస్తున్నారు. సచివాలయంలోని హెరిటేజ్ భవనంతో పాటు అమ్మవారి గుడి, మసీద్ లను కూల్చివేసి, వాటి శిధిలాలపై కొత్త సచివాలయం నిర్మాణం చేపట్టారు. అట్లాగే చారిత్రాత్మక కట్టడాలైన అసీంబ్లీ భవనం, ఉస్మానియా ఆసుపత్రి, ఎర్రమంజిజ్ ప్యాలస్ లను కూల్చేందుకు సిద్దపడుతున్నారు.
నగర ప్రజల దాహార్తిని తీర్చే విధంగా కృష్ణా, గోదావరి జలాలను నిల్వచేసుకొనేందుకు రాచకొండ, శామీర్ పేటల వద్ద రెండు రిజర్వాయర్లను నిర్మిస్తామని చెప్పి, డిపిఆర్ లుకూడా సిద్దమైనా ఒక తట్ట మట్టిని కూడా ఎత్తలేదు. కాళేశ్వరం నుండి లక్ష కోట్ల రూపాయలతో తన ఫార్మ్ హౌస్ దగ్గరలోని కొండపోచమ్మ సాగర్ వరకు జలాలు తరలించిన కేసీఆర్ కు హైదరాబాద్ నగర ప్రజల తాగునీటి అవసరాలు పట్టడం లేదు.
గత ఎన్నికల ముందు 32,000 కొత్త కనెక్షన్లు ఇస్తామన్నారు. ఒక్క రూపాయికే పేదలకు కొత్త కనెక్షన్ అన్నారు. నల్లాల కోసం దరఖాస్తు లు పేరుకుపోతున్నా నాలుగోవంతు మందికి మించి ఇవ్వలేదు.
తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగకాలాపన ప్రధాన అంశం. జీహెచ్ఎంసీ పరిధిలో ఎంతమందికి కొత్త ఉద్యోగాలు ఇచ్చారో చెప్పగలరా? గత ఎన్నికల ముందు 18,000 కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తున్నట్లు చెప్పిన ప్రభుత్వం తిరిగి ఆ మాట ఎత్తడం లేదు. తెలంగాణ అకాడమీ అఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ద్వారా నాలుగేళ్లలో లక్ష మంది యువతకు నైపుణ్య శిక్షణ కల్పించి, ఉద్యోగాలు కల్పిస్తామన్న ప్రభుత్వం ఒక్కరికైనా ఇచ్చిందా?
జీహెచ్ఎంసీకి వివిధ పధకాల క్రింద రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వార్షిక గ్రాంట్ లను ఇవ్వడం లేదు. పైగా వివిధ పధకాల పేరుతో జీహెచ్ఎంసీ ద్వారా అప్పులు తీసుకొని, వాటిని ప్రభుత్వం వాడుకొంటున్నది. ఈ అప్పుల భారం అంతా నగర ప్రజలు మోయవలసిందే గదా. దాని కోసం వారిపై కొత్త పన్నులు తప్పవు. రాష్ట్ర ప్రభుత్వం నుండి రావలసిన నిధులు రాకపోతు ఉండడంతో ఉద్యోగులకు జీతాలు ఇవ్వడమే కార్పొరేషన్ కు భారంగా మారింది.
నగర ప్రజలను వరదల నుండి విముక్తి కలిగించడం కోసం సీవరేజి డెవలప్మెంట్ ప్లాన్ అమలుకు రూ 10,000 కోట్లు కూడా ప్రభుత్వం ఇవ్వలేక పోవడంతో నగర ప్రజలకు ముంపు బాధలు తప్పడం లేదు. కార్పొరేషన్ కు ప్రతి ఏటా ఇవ్వవలసిన రూ 450 కోట్ల అభివృద్ధి నిధిని కూడా ఇవ్వడం లేదు. దానితో నగరంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి సాధ్యం కావడం లేదు.
నగర పరిధిలో మొదటి దశలో రూ 130 కోట్లతో 40 మోడల్ మార్కెట్లు, 200 ఆదర్శ మార్కెట్లు అభివృద్ధి చేస్తామని చెప్పారు. కేసీఆర్ స్వయంగా మోండా మార్కెట్ ను సందర్శించి దానిని రెండంతస్తుల మార్కెట్ గా ఆధునీకరిస్తామని చెప్పారు. కేవలం నాలుగు మార్కెట్ లు మాత్రమే నిర్మించినా వాటిని కూడా ఇంకా అందుబాటులోకి తేలేదు.
స్వచ్ఛ హైదరాబాద్ లో భాగంగా నగరంలో 200 నుండి 300 ఎకరాలలో 15 కొత్త డంప్ యార్డ్ లు అభివృద్ధి చేస్తామని చెప్పి ఒక్కటి కూడా చేయలేదు. కోటి రూపాయలతో అన్ని ఆధునిక హంగులతో 36 స్మశాన వాటికలు ఏర్పాటు చేస్తామని ఒక్కటి కూడా చేయలేదు. అన్ని కాలనీలలో కొత్త పార్క్ ల ఏర్పాటు మాటలకే పరిమితమైంది.
చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న ఎంఎంటీఎస్ రెండో దశ ఎందుకు ఆగిపోయింది? కేంద్రం నిధుల మంజూరుకు సిద్ధంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. నగరంలో నాలుగు ఆధునిక ఆడిటోరియంలను నిర్మిస్తామని చెప్పి ఒక్కదానిని కూడా ప్రారంభించలేదు. కనీసం ఉన్న రవీంద్ర భారతిని ఆధునీకరించే ప్రయత్నం చేయడం లేదు.
నగరం అంతటా ఫ్రీ వైఫై అందుబాటులో తెస్తామని పట్టించుకోవడం లేదు. ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు నగరంలో 25 కిమీ మేర సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేస్తామని అటువైపే చూడటం లేదు. హైటెక్ వద్ద ఏర్పాటు చేసినా అందుబాటులోకి తేలేదు.
ఒక వంక నగరంలో కనీసం మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయకుండా, మరోవంక కరోనా మహమ్మారితో చితికిపోయి ప్రజలు నానావస్థలు పడుతుంటే వారిపై ఎల్ ఆర్ ఎస్ భారం మోపుతూ ఒకొక్కరి నుండి రూ 50,000 నుండి రూ 2 లక్షల వరకు వసూలు చేసే పన్నాగం కేసీఆర్ ప్రభుత్వం చేయడం దుర్మార్గం. అందుకోసం వచ్చిన 25 లక్షల దరఖాస్తుల నుండి రూ 20,000 కోట్లు రాబట్టలనే ప్రభుత్వం ప్రయత్నం ప్రజలను నిలువు దోపిడీ చేయడమే.
More Stories
‘స్వర్ణాంధ్ర విజన్’ సాకారానికి సహకరించండి
భారత్ భద్రతను దెబ్బతీసేలా వ్యవహరించం
రుణమాఫీపై బహిరంగ చర్చకు రేవంత్ కు ఏలేటి సవాల్!