రాజ్యాంగంలో `సామ్యవాదం’. `లౌకికవాదం’ పదాలెందుకు?

నవంబర్వి 26: సంవిధాన్ దివాస్ 

ప్రపంచంలోనే అతి పెద్ద, ప్రగతిశీలమైన రాజ్యాంగంగా భావించే భారత రాజ్యాంగంను రాజ్యాంగ సభ ఆమోదించిన నవంబర్ 26ను `రాజ్యాంగ దినోత్సవం’గా జరుపుకొంటున్నాము. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజును అధికారికంగా విశేషమైన ప్రాధాన్యతతో 2015 నుండి జరుపుకొంటున్నాము. దీనినే `సంవిధాన్’ దివాస్ గా కూడా జరుపుకొంటున్నాము.

1949 నవంబర్ 25న రాజ్యాంగ ముసాయిదా ప్రతిని రాజ్యాంగ సభ ముందు ఉంచుతూ రాజ్యాంగ రచన కమిటీ చైర్మన్ డా. బి ఆర్ అంబెడ్కర్ సుదీర్ఘ ప్రసంగం  భావోద్వేగంతో చేశారు. ఆ మరుసటి రోజున రాజ్యాంగ సభ రాజ్యాంగ ప్రతికి ఆమోదం తెలిపింది. ఆ నాడు ఆమోదించిన రాజ్యాంగంలో `సామ్యవాదం’,  `లౌకికవాదం’ అనే పేర్లు లేవు. 
 
సామ్యవాదిగా,  లౌకికవాదిగా పేరొందిన పండిట్ జవహర్ లాల్ నెహ్రు ఆ పదాలు చేర్చడానికి ఇష్టపడలేదు. చివరకు డా. అంబెడ్కర్ కూడా సుముఖత వ్యక్తం చేయలేదు. దానితో భారత్ ను “సర్వసత్తాక, ప్రజాస్వామిక రిపబ్లిక్” గా మాత్రమే పీఠికలో పేర్కొన్నారు. 
 
 రాజ్యాంగ సభలోనే ఈ అంశాల గురించి సుదీర్ఘ చర్చ జరిగింది. “లౌకిక, సమాఖ్య, సామ్యవాద జాతి” పదాలను రాజ్యాంగంలో చేర్చాలని కోరుతూ ప్రొఫెసర్ కె టి షా నవంబర్ 15, 1948న ప్రతిపాదించారు. ఆయన ప్రతిపాదనపై సుదీర్ఘ చర్చ అనంతరం తిరస్కరించారు. నెహ్రు, అంబెడ్కర్ కూడా తిరస్కరించడం గమనార్హం.
 
అయితే దేశంలో ప్రాధమిక హక్కులు అణచివేసి, ప్రతిపక్ష నేతలనే కాకుండా అసమ్మతి తెలిపిన వారందరిని – సుమారు లక్ష మందిని జైలులో ఉంచిన అత్యవసర పరిస్థితి సమయంలో 1976లో నాటి ప్రధాని ఇందిరా గాంధీ తీసుకు వచ్చిన రాజ్యాంగ 42వ సవరణ ద్వారా “సామ్యవాదం, లౌకికవాదం” అనే పదాలను పీఠికలో చేర్చారు. ఇప్పుడు భారత్ ను “సర్వసత్తాక, ప్రజాస్వామ్య, సామ్యవాద, లౌకిక రిపబ్లిక్” అని పేర్కొంటున్నారు. 
 
సామ్యవాదం, లౌకికవాదం అనేడివి ఆర్ధిక, సామజిక, రాజకీయ  అంశాలకు తప్ప మౌలిక అంశాలు కాలేవని అనేకమంది నిపుణులు ఆ సమయంలో, ఆ తర్వాత కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవలం ఒకే సవరణ, 42వ సవరణ ద్వారా రాజ్యాంగంలో 58 మార్పులు తీసుకు రావడం ద్వారా మొత్తం రాజ్యాంగాన్ని తలకిందులు చేసారని ప్రముఖ రాజ్యాంగ నిపుణులు దుర్గాదాస్ బసు వ్యాఖ్యానించారు. రాజ్యాంగం పేరుతో ప్రమాణస్వీకారం చేస్తూ అధికార పదవులలోకి వస్తున్న వారంతా ఈ రోజున ఈ చారిత్రక సత్యాలను నెమరువేసుకోవాలని తమిళనాడు మాజీ మంత్రి హెచ్ వి హండే (92) ఈ సందర్భంగా పిలుపిచ్చారు. 
 
ఈ అంశాలపై పార్లమెంట్ లో గాని, జాతీయ స్థాయిలో గాని అప్పట్లో గాని, ఆ తర్వాత గాని చెప్పుకోదగిన చర్చలు జరగనే లేదు. కేవలం తన నిరంకుశ పాలనకు మద్దతు ఇస్తున్న వామపక్ష వర్గాల మెప్పు పొందడం కోసం, ఒక విధంగా తన నిరంకుశ పాలనను సమర్ధించుకొనే విధంగా ఇందిరాగాంధీ ఈ మార్పులు తీసుకు వచ్చారు గాని అంతకన్నా చెప్పుకోదగిన ఉద్దేశ్యం ఉన్నట్లు కనబడదు. 
 
1991లో ఉదారవాద విధానాల పట్ల ఏ మాత్రం అవగాహన, పరిజ్ఞానం లేకపోయినప్పటికీ తప్పనిసరి పరిస్థితులలో పివి నరసింహారావు `సామ్యవాదం’కు తిలోదకాలిచ్చి `మార్కెట్ ఆర్ధిక వ్యవస్థ’ను తీసుకు వచ్చారు. ఆ తర్వాత అయినా రాజ్యాంగం మౌలిక స్వరూపం మార్చే విధంగా ఇందిరాగాంధీ సంకుచిత ప్రయోజనాలకోసం తీసుకు వచ్చిన మార్పులపై పునరాలోచన చేసే ప్రయత్నం జరపనే లేదు. 
 
కేశవానంద భారతి కేసులో రాజ్యాంగ మౌలిక స్వరూపం మార్చే అధికారం పార్లమెంట్ కు కూడా లేదని సుప్రీం కోర్ట్ రాజ్యాంగ బెంచ్ స్పష్టం చేసింది. అయితే అత్యవసర పరిస్థితిలో ఒక విధంగా చెప్పాలి అంటే దొంగచాటుగా తీసుకు వచ్చిన ఈ రెండు పదాల రాజ్యాంగ బద్ధత గురించి పరిశీలన చేయడానికి ఉన్నత న్యాయస్థానాలు కూడా సాహసింపక పోవడం విచారకరం.
 
రాజకీయ పార్టీలు సహితం ఇటువంటి మౌలిక అంశాలపై దృష్టి సారించడం లేదు. వామపక్షాలు, సామ్యవాద బృందాలకు ఈ పదాలు ఆనందం కలిగించవచ్చు.  కానీ వాటికి పూర్తిగా వ్యతిరేకమైన భావజాలం గల పక్షాలు సహితం, ఉదాహరణకు బీజేపీ సహితం మౌనం వహించడం దురదృష్టకరం. పైగా ఈ పదాలను ఒక ఫాషన్ గా వారు కూడా ఉపయోగించే పరిస్థితులు నెలకొన్నాయి. 
 
1989లో ప్రజాప్రతినిధ్యం చట్టం, 1951కి సవరణ తీసుకొచ్చి సెక్షన్ – 29-ఎ (5) చేర్చారు. దాని ప్రకారం ప్రతి రాజకీయ పార్టీ తమకు సామ్యవాదం, లౌకికవాదం పట్ల విశ్వాసం ఉన్నట్లు ఫిడవిట్ తప్పనిసరిగ్గా సమర్పించవలసి ఉంటుంది. ఈ పదాల పట్ల భిన్నాభిప్రాయాలు గలవారెవ్వరు సహితం వీటిని సవాల్ చేసే ప్రయత్నం చేయలేదు. పైగా, భారత్ వంటి అతిపెద్ద ప్రజాస్వామ్యంలో, అన్ని వాదాలకు అవకాశం ఉన్న దేశంలో నిర్దుష్ట భావజాలాలను ప్రజలపై బలవంతంగా రుద్దడం, వాటిని దేశ మౌలిక భావాలుగా పేర్కొనడం ప్రశ్నార్ధకరంగా మారుతుంది.
 
ఈ పదాలు రాజ్యాంగం మౌలిక స్వభావానికి సంబంధించినవి కావని, కాబట్టి రాజ్యాంగం పీఠికలో చేర్చరాదని, రాజకీయ పార్టీగా గుర్తింపు కొనసాగించాలి అంటే ఆ పదాలను ఒప్పుకోవాలి అనడం నిరంకుశ విధానం కాగలదని అంటూ న్యాయస్థానాలలో సవాల్ చేసిన పార్టీ ఒక్కటే ఒక్కటి ఉంది. అదే స్వతంత్ర పార్టీ. 
 
1991లో రాజ్యాంగంలో ఈ పదాలను సవాల్ చేస్తూ, వాటి పట్ల విశ్వాసం ప్రకటింపలేమని స్పష్టం చేస్తూ స్వతంత్ర పార్టీకి చెందిన ఇద్దరు బొంబాయి హైకోర్టు లో దావా వేశారు. వేసి మూడు దశాబ్దాలు అవుతున్నా ఇప్పటికి కూడా వారి వాదనను వినే సహవాసం బొంబాయి హైకోర్టు చేయకపోవడం గమనార్హం. ఈ లోగా దావా వేసిన వారిద్దరూ చనిపోయారు. వారిద్దరూ మినుమసాని అనుచరులు. వారిలో ఒకరు ఎస్ వి రాజు. ఆ తర్వాత ఏర్పడిన ఇండియన్ లిబరల్ గ్రూప్ అధ్యక్షుడు. 
 
తాజాగా ఈ సంవత్సరమే ముగ్గురు సుప్రీం కోర్ట్ లో కూడా దావాలు వేశారు. వారిలో ఇద్దరు న్యాయవాదులు, ఒకరు సామజిక కార్యకర్త ఉన్నారు. తాము ఒక రాజకీయ పార్టీని ప్రారంభించాలి అనుకొంటున్నామని, ఈ పదాల పట్ల తమకు అభ్యంతరం ఉన్నదని వారు స్పష్టం చేశారు. 
రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 భారత పౌరులకు తమ ఇష్టం వచ్చిన మతంను అనుసరించే, ప్రచారం చేసుకొనే హక్కు ఇచ్చినప్పుడు `లౌకికవాదం’ ప్రస్తావన ఎందుకు వస్తుందనే ప్రశ్నను లేవదీశారు. ఈ దావా వేసినవారు బలరాం సింగ్, కరుణేష్ కుమార్ శుక్లా, ప్రవేశ్ కుమార్. 
 
ఈ రెండు పదాలు ప్రాధమికంగా రాజకీయ అంశాలని, వాటిని రాజ్యాంగ పీఠికలో ఏ విధంగా చేరుస్తారని వారు ప్రశ్నించారు. పైగా ఈ అంశాన్ని మతాన్ని అనుసరించే స్వేచ్ఛ (ఆర్టికల్ 25), స్వేచ్ఛగా మాట్లాడే హక్కు (ఆర్టికల్ 19(1) లను దృష్టిలో ఉంచుకొని చూడాలని, ప్రజాస్వామ్య భావనకు వ్యతిరేకం అని వారు వాదించారు. 
 
కాగా, ఈ రెండు భావాలు కూడా విదేశీ భావాలని పేర్కొంటూ మైనారిటీ విద్యాసంస్థలకు,  ప్రజలకు ప్రత్యేక హక్కులు ఇస్తూ `లౌకికవాదం’ రాజ్యాంగ మౌలిక స్వభావం ఏ విధంగా అవుతుందనే ప్రశ్నను కూడా లేవనెత్తారు. అదీగాక పరిమితంగానైనా మత వ్యవహారాలలో జోక్యం చేసుకొనే హక్కు మనదేశంలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది కూడా.  ఇప్పటికైనా సుప్రీం కోర్ట్ ఈ అంశంపై లోతయిన చర్చకు పూనుకోగలదని ఆశిద్దాం.