కాల పరీక్షకు తట్టుకొని భారత రాజ్యాంగం నిలబడినదని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి టి అమరనాథ్ సంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా “రాజ్యాంగ బద్ధత – భారతదేశ అనుభవం” అంశంపై హైదరాబాద్ లో సోషల్ కాజ్ జరిపిన వెబినార్ లో ముఖ్యఅతిధిగా పాల్గొంటూ రాజ్యాంగం స్థిరమైనది కాదని, క్రియాశీలమైన, జీవన పక్రియ అని స్పష్టం చేశారు.
మన రాజ్యాంగాన్ని సమీక్షించుకుని, దాని మౌలిక విలువలకు అంకితం కావడానికి రాజ్యాంగ దినోత్సవం ఒక అవకాశమని ఆయన తెలిపారు. కాలక్రమంలో ఏర్పర్చిన సంప్రదాయాలు, వివిధ హైకోర్టులు, సుప్రీం కోర్ట్ ఇచ్చిన వివరణలు రాజ్యాంగంలో భాగం అవుతాయని పేర్కొన్నారు.
రాజ్యాంగ దినం పౌరులకు న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావాన్ని ప్రోత్సహించడం పట్ల దృష్టి సారించే సందర్భం అని చెప్పారు. రాజ్యాంగ ఆదర్శాలు పుస్తకాలకే పరిమితం కాకూడదని, రోజువారీ సామజిక, రాజకీయ జీవితంలో ప్రతిబింబించాలని న్యాయమూర్తి ఈ సందర్భంగా హితవు చెప్పారు.
“రాజ్యాంగం ఎంత మంచిదైనా, దానిని అమలు చేసేవారు మంచి వారు కాకపోతే, అది చెడ్డదని రుజువు అవుతుంది. అదే అమలు చేసేవారు మంచివారయితే రాజ్యాంగం ఎంత చెడ్డదైనా మంచి ఫైలితాలు ఇస్తుంది” అని డా. బి ఆర్ అంబెడ్కర్ చేసిన హెచ్చరికను ఈ సందర్భంగా అందరు గుర్తు పెట్టుకోవాలని కోరారు.
రాజ్యాంగం నిర్దేశించిన ప్రభుత్వ విధానంలో ఆదేశిక సూత్రాలను పాలకులు గుర్తుంచుకోవాలని, అదే విధంగా పౌరులు తమ కు ప్రాథమిక హక్కులు మాత్రమే కాకుండా, ప్రాథమిక బాధ్యతలు కూడా ఉన్నాయని గుర్తుంచుకోవాలని న్యాయమూర్తి అమరనాథ్ గౌడ్ సూచించారు.
సాధారణ పౌరులు రాజ్యాంగం సూచించిన ప్రాధమిక విధులను ఎల్లప్పుడూ గుర్తుంచుకొని, వాటిని తమ శక్తీ మేరకు నెరవేర్చే ప్రయత్నం చేయడం ద్వారా రాజ్యాంగం పట్ల విధేయంగా ఉండాలని ఆయన చెప్పారు. రాజ్యాంగబద్ధమైన నైతికత, సంస్కృతిని పెంపొందించే ఉత్తమ రాజ్యాంగ పద్ధతులను అనుసరించ గలిగితే మనం సమతుల్యత గల, ప్రగతి శీల సమాజం ఏర్పర్చుకోగలమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
“మనం రాజ్యాంగబద్ధతను అలవరచుకోవాలి. ఈ రాజ్యాంగ దినోత్సవం రోజున, భారత రాజ్యాంగాన్ని, దాని ఆదర్శాలను ఆదర్శించడానికి అంకితభావం ప్రదర్శించుకోవాలి” అని ఆయన హితవు చెప్పారు.
వెబ్‌నార్‌కు అధ్యక్షత వహించిన ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ జి బి రెడ్డి మాట్లాడుతూ, రాజ్యాంగం దేశంలోని అత్యున్నత చట్టమని, ఇది పరిమితమైన ప్రభుత్వం, పరిపాలనలో జవాబుదారీతనంకుప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. రాజ్యాంగానికి కట్టుబడి, దాని ఆదర్శాలను, సంస్థలను గౌరవించడం అందరి ప్రాథమిక కర్తవ్యం అని ఆయన పేర్కొన్నారు. సాధారణ మెజారిటీ రాజ్యాంగంలోని ప్రతిదాన్ని మార్చలేమని, కొన్ని మౌలిక విలువలు ఉన్నయాభి స్పష్టం చేశారు.
హైకోర్టు సీనియర్ న్యాయవాది ఎల్ రవిచందర్ మాట్లాడుతూ హింస అనేది రాజ్యాంగబద్దతకు, రాజ్యాంగంకు విరుద్ధమని స్పష్టం చేశారు. స్వేచ్ఛ విషయంలో రాజీ ప్రసక్తి లేదని అంటూ, చర్చించలేనిదిగా ఉండాలని సమ్మె చేసే హక్కు రాజ్యాంగంలోని ప్రాథమిక స్ఫూర్తి అని ఆయన తెలిపారు. నాగరిక సమాజంలో చట్టబద్ధ పాలన ముఖ్యమైనదని అంటూ రాజ్యాంగ బద్ధత పట్ల మన విశ్వాసాలకు కొనసాగింపే రాజ్యాంగం అని చెప్పారు.
భారత అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఎన్ హరనాథ్ మాట్లాడుతూ 1976లో రాజ్యాంగం పీఠికలో సామ్యవాదం, లౌకికవాదం పదాలను అర్ధాంతరంగా జొప్పించడంతో దేశంలో దేశ వ్యతిరేక శక్తులకు ప్రోత్సాహం కల్పించిన్నట్లు విచారం వ్యక్తం చేశారు. ఈ పదాల తొలగింపు గురించి ఎవ్వరు మాట్లాడక పోవడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. సోషల్ కాజ్ అధ్యక్షుడు డా. బి దినేష్ కుమార్, కార్యదర్శి సదానంద్ కూడా పాల్గొన్నారు.
More Stories
సామరస్యంతోఅస్పృస్యతను పూర్తిగా నిర్ములించాలి
డొనాల్డ్ ట్రంప్ సమీపంలో కాల్పులు.. మరోసారి హత్యాయత్నం?
ప్రజాపాలన దినోత్సవం కాదు… ప్రజావంచన దినోత్సవం