న్యూజిలాండ్ ఎంపీ సంస్కృతంలో ప్ర‌మాణ స్వీకారం 

న‌్యూజిలాండ్‌లో భార‌త సంత‌తి ఎంపీ డాక్ట‌ర్ గౌర‌వ్ శర్మ సంస్కృతంలో ప్ర‌మాణ స్వీకారం చేశారు. హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని హ‌మీర్‌పూర్‌కు చెందిన గౌర‌వ్ శ‌ర్మ  ఈ మ‌ధ్య జ‌రిగిన ఎన్నిక‌ల్లో లేబ‌ర్ పార్టీ త‌ర‌ఫున హామిల్ట‌న్ వెస్ట్ నుంచి విజ‌యం సాధించారు. 
 
బుధ‌వారం ప్ర‌మాణ స్వీకారం సంద‌ర్భంగా ఆయ‌న మొద‌ట న్యూజీలాండ్ స్ధానిక భాష మావోరీలో ప్ర‌మాణం చేసి త‌ర్వాత సంస్కృతంలో చేసిన‌ట్లు భార‌త హైక‌మిష‌న‌ర్ ముక్తేష్ ప‌ర్‌దేశీ ట్విట‌ర్‌లో తెలిపారు. రెండు దేశాల సంస్కృతీ సాంప్ర‌దాయాల‌ను ఆయ‌న ఇలా గౌర‌వించార‌ని ముక్తేష్ ట్వీట్ చేశారు. 
 
ఆక్లాండ్‌లో ఎంబీబీఎస్‌, వాషింగ్ట‌న్‌లో ఎంబీఏ చేసిన గౌర‌వ్ శర్మ  ప్ర‌స్తుతం హామిల్ట‌న్‌లోని నాట‌న్‌లో జ‌న‌ర‌ల్ ప్రాక్టిష‌న‌ర్‌గా ప‌ని చేస్తున్నారు. మ‌రి మీరు హిందీలో ఎందుకు ప్ర‌మాణ స్వీకారం చేయ‌లేదు అని ట్విట‌ర్‌లో ఓ యూజ‌ర్ అడిగిన ప్ర‌శ్న‌కు కూడా గౌర‌వ్ ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చారు.
 
అంద‌రినీ సంతోషంగా ఉంచ‌డం క‌ష్టం. అందుకే సంస్కృతంలో ప్ర‌మాణం చేసి అన్ని భార‌తీయ భాష‌ల‌కు త‌గిన గౌర‌వం ఇచ్చిన‌ట్లు గౌర‌వ్ శ‌ర్మ తెలిపారు. 
 
ముందు తాను కూడా త‌న మాతృభాష‌లోనో, పంజాబీలోనో చేయాల‌ని అనుకున్నా.. అన్ని భాష‌ల‌కు మూల‌మైన సంస్కృతంలో చేసి అన్నింటికీ త‌గిన గౌర‌వం ఇచ్చిన‌ట్లు ట్వీట్ చేశారు. ఆయ‌న ప్ర‌మాణ స్వీకారం వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. చాలా మంది ఆయ‌న‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.