జైలు నుంచే లాలూ బీహార్ ప్రభుత్వం కూల్చే యత్నం! 

జైలు నుంచే బీహార్ లో ఎన్డీయే ప్రభుత్వాన్ని కూల్చడానికి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పధకాలు పన్నుతున్నారా? స్పీకర్ ఎన్నిక సందర్భంగా బయటపడిన ఆడియో టేప్ లు ఈ అనుమానాన్ని కలిగిస్తున్నాయి. ఏకంగా బీజేపీ నేతలకు ఫోన్లు కూడా చేసి స్పీకర్ ఎన్నికకు దూరంగా ఉండాలని, ఆర్జేడీకి మద్దతివ్వాలని బీజేపీ ఎమ్మెల్యేలను కోరారు. ఈ ఆడియో టేపులను బీజేపీ బయటపెట్టింది. లాలూ ప్రసాద్ వేస్తున్న ఎత్తులు ఏవికూడా సఫలం కావని తెగేసి చెబుతోంది.
ఇదే విషయంపై బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీ ట్విట్టర్ వేదికగా  సంచలన వ్యాఖ్యలు చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్ జైలు నుంచే తమ ప్రభుత్వాన్ని కూలదోయాలని చూస్తున్నారని ఆరోపించారు. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి నితీశ్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని లాలూ ప్రసాద్ యాదవ్ ప్రయత్నిస్తున్నారని ట్వీట్ చేశారు. ఇలా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, మహాఘట్ బంధన్‌కు సహాయపడాలని లాలూ ప్రసాద్ ప్రయత్నిస్తున్నారని సుశీల్ మోదీ ఆరోపించారు.
‘‘8051216302 అనే ఫోన్ నంబర్ నుంచి లాలూ ప్రసాద్ యిదవ్ ఎన్డీయే ఎమ్మెల్యేలకు ఫోన్లు చేస్తున్నారు. మంత్రి పదవులు గ్యారెంటీ అని భరోసా కూడా కల్పిస్తున్నారు. నేను ఫోన్ చేసినపుడు లాలూ ప్రసాద్ యాదవే ఫోన్ లిప్ట్ చేశారు” అని తెలిపారు. “జైలు నుంచే ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయవద్దని నిర్మొహమాటంగా చెప్పేశాను. ఇందులో విజయవంతం కూడా కాలేరని లాలూతో చెప్పేశాను.’’ అని సుశీల్ మోదీ ట్విట్టర్ లో పేర్కొన్నారు.
 
బీజేపీ ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ..’స్పీకర్‌ ఎన్నికలకు హాజరు కావద్దు. కరోనా వచ్చిందని చెప్పండి. మీరు మాకు మద్దతు ఇస్తే మా నాయకుడు స్పీకర్‌ అవుతారు. అప్పుడు మీకు కావల్సిన పనులు జరిగిపోతాయి’ అంటూ లాలూ ఆఫర్‌ చేశారు. 
 
 బిహార్ అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్డీయే అభ్యర్థి, బిజెపి ఎమ్యెల్యే విజయ సిన్హా ఎన్నికయ్యారు. స్పీకర్ ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి విజయ సిన్హాకు 126 ఓట్లు లభిస్తే, మహాఘట్ బంధన్ అభ్యర్థి అవధ్ బిహారీ చౌధురికి 114 ఓట్లు వచ్చాయి. విజయ సిన్హా స్పీకర్‌గా ఎన్నికైన తర్వాత సంప్రదాయం ప్రకారం సీఎం నితీశ్, విపక్ష నేత తేజస్వీ యాదవ్ మర్యాద పూర్వకంగా ఆయన్ను స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు.
 
పశుగ్రాసం అవినీతి కేసుల్లో అరె‍స్టు అయిన లాలూ ప్రసాద్‌ యాదవ్ జార్ఖండ్‌ జైలులో  శిక్షను అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అనారోగ్య సమస్యలతో శిక్షాకాలంలో ఎక్కువ సమయం ఆసుపత్రిలోనే గడిపారు. ఈనెల ప్రారంభంలో జరిగిన బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే అధికారాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
 75 స్థానాలతో ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా అవతరించగా.. బీజేపీ 74, జేడీయూ 43 స్థానాల్లో విజయం సాధించాయి. అయితే కూటమిలో బీజేపీకి అత్యధిక స్థానాలు వచ్చినప్పటికీ సీఎం పీఠం మాత్రం జేడీయూకి అప్పగించింది.
పశుగ్రాసం అవినీతి కేసుల్లో శిక్షలు అనుభవిస్తున్నా…. లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఏమాత్రం ప్రాపకం తగ్గలేదని, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. రాంచీ నుంచే లాలూ ప్రసాద్ యాదవ్ ఎన్డీయే ఎమ్మెల్యేలకు ఫోన్లు చేస్తున్నారని, మంత్రి పదవులు ఇస్తామన్న హామీలు కూడా చేస్తున్నారని సుశీల్ మోదీ ట్వీట్ చేశారు.