పెద్ద పెద్ద మాటలు చెప్పడం తప్ప చెప్పిన ఏ పనిని చేయకుండా ప్రజలను నిలువు దోపిడీ చేయడంలో మునిగిపోయిన కేసీఆర్ ప్రభుతానికి మొన్ననే దుబ్బాకలో ప్రజలు గట్టి గుణపాఠం చెప్పారు. ఇప్పుడు హైదరాబాద్ ను విశ్వనగరంగా మారుస్తామని అంటూ గత ఆరేళ్లుగా ప్రజల నుండి కలల ప్రపంచం సృష్టిస్తూ హైదరాబాద్ ను విషాదనగరంగా మార్చిన కేసీఆర్- కేటీఆర్ లకు జీహెచ్ఎంసీ ఎన్నికలలో బాలట్ పత్రం ద్వారా చెంపదెబ్బ వేసే అవకాశం నేడు ప్రజలకు కలిగింది.
ఆరేళ్లలో హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా మార్చేసిన్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ ప్రగల్భాలు పలుకుతూ వచ్చారు. నిత్యం అబద్దాలతో ప్రజలను వచించె ప్రయత్నం చేయడం తప్పా నగరానికి వారు చేసినది ఏమీ లేదని ఈ మధ్య కురిసిన వర్షాలతో వెల్లడైనది.
నగరంలో రూ 67,000 కోట్ల వ్యయంతో మౌలిక సదుపాయాలను ఘనంగా పెంపొదింపే చేసిన్నట్లు కేటీఆర్ స్వయంగా రాష్ట్ర శాసనసభలో చెప్పారు. నిజంగా అంతగా అభివృద్ధి చేస్తే నగరంలో రోడ్లపైకి వర్షపు నీరు ఎందుకు వచ్చింది.? కాలనీలకు, కాలనీళ్లు ఎందుకు ముంపుకు గురయ్యాయి? గతంలో ఎపుడైనా ఈ విధంగా జరిగిందా?
ఈ మధ్యనే లాక్ డౌన్ సమయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకొని రహదారులు ఆధునికం చేశామని చెప్పుకొన్నారు. అదే నిజమైతే రోడ్లన్నీ గుంటలమయం ఎందుకయ్యాయి? రూ 67,000 కోట్లను ఎక్కడ ఖర్చు పెట్టారు? ఏయే బస్తీలలో ఏయే పనులు చేశారు? డివిజన్ల వారీగా ప్రభుత్వం చేసిన ఖర్చులపై ఒక స్వేతపత్రంను ప్రకటించి ప్రజల ముందు ఉంచగలరా?
ఐదేళ్ల క్రితం జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఒక సంవత్సర కాలంలో లక్ష మంది పేదలకు రెండు పడకల ఇళ్ళు నిర్మించి ఇస్తామని స్వయంగా కేసీఆర్ భరోసా ఇచ్చారు. ఐదేళ్లయింది. ఎన్ని గృహాలు నిర్మించారో చెప్పగలరా? మళ్ళి ఎన్నికలు వస్తున్నాయని హడావుడిగా గత నెల దసరా రోజున 11,000 గృహాలలో గృహప్రవేశం జరిపించారు. లక్ష ఇళ్ళెక్కడ? 11,000 గృహాల ప్రవేశం ఎక్కడ?
2015లో జీతాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించామని సమ్మెచేసిన జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులు 25,000 మందికి కూడా రెండు పడకల గృహాలు నిర్మిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ హామీ ఏమైనది?
హైదరాబాద్ నగరాన్ని డల్లాస్ నగరంగా, పాత బస్తీని ఇసాతంబుల్ నగరంగా అత్యాధునికంగా అభివృద్ధి చేస్తామని కేసీఆర్ 2015లో చెప్పిన మాటలు సోషల్ మీడియా లో వైరల్ గా వ్యాపిస్తున్నాయి. స్కై స్క్రాపర్లు, నగరం చుట్టూ గ్రీన్ కారిడార్, వేగంగా దూసుకు పోయే స్కై వేలు, నగరం శివారులో సాటిలైట్ టౌన్ షిప్ లతో అంతర్జాతీయ ప్రమాణాలతో నగరాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.
ఇప్పుడేమైంది? ఆరేళ్లలో కేసీఆర్ ఒక్క రోడ్డులో అయినా కలియతిరిగి చూసారా? చివరకు ఎన్నడూ లేని వర్షాలు, వరదలతో నగర ప్రజలు భయకంపితులైనప్పుడైనా ప్రగతి భవన్ నుండి బైటకు వచ్చి బాధిత ప్రజలను కనీసం పలకరించారా? వరదలొచ్చి నెలరోజులైనా ఇంకా పలు కాలనీలలో బురద వదలక పోవడం చూస్తే నగరం అందచందాలు అర్ధం అవుతాయి.
గత పర్యాయం జీహెచ్ఎంసీ ఎన్నికలలో గెలిస్తే 100 రోజుల ప్రణాళికలతో నగరం రూపురేఖలనే మార్చివేస్తామని మునిసిపల్ మంత్రిగా కేటీఆర్ హడావుడి చేశారు. ఐదేళ్లయింది. కనీసం రోడ్లలో గుంతలనైనా పూడ్చారా?
హైదరాబాద్ నగరాన్ని సంపన్న నగరంగా మార్చిన మూసి నదిలో అన్ని రకాల కాలుష్యాలతో పాటు, ఆక్రమణలకు గురవుతూ మురికి కాలువగా మారింది. గుజరాత్ లో నరేంద్ర మోదీ ప్రభుత్వం సబర్మతి నది రూపురేఖలు మార్చి, అందమైన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దిన విధంగా మూసి నదిని కూడా మారుస్తామని చెప్పి అక్కడకు వెళ్లి వచ్చారు.
మూసి నది అభివృద్ధి కోసం అంటూ ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేసి కనీసం కేంద్రం మంజూరు చేసిన నిధులను కూడా ఖర్చు పెట్టలేదే? రూ 1400 కోట్లు ఖర్చు పెడతామన్న కేసీఆర్ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందో చెప్పగలరా?
2016లో వర్షాలకు నిజాంపేటలోని బండారి లేఔట్ కాలనీలు ముంపుకు గురయితే నగరంలోని కబ్జాలకు గురైన చెరువులు, నాళాలు, కుంటలను ఆక్రమణలు తొలగించి, అందంగా తీర్చిదిద్దుతామని కేసీఆర్ చెప్పారు. కానీ ఆ తర్వాత ఒక్క చెరువునైనా అభివృద్ధి చేశారా? పైగా నగరంలోని పలు చెరువులను అధికార పార్టీకి చెందిన నేతలే కబ్జా చేస్తున్నారు.
ఇటీవల వచ్చిన వరదలలో ముంపుకు గురైన ప్రజలకు సహాయం కోసం అంటూ ఇంటికి రూ 10,000 చొప్పున పంపిణి చేయడం కోసం రూ 650 కోట్లు విడుదల చేశారు. అయితే బ్యాంకుల ద్వారా బదిలీ చేయకుండా టి ఆర్ ఎస్ నాయకులు నగదు పంచుతూ, అత్యధికభాగం పార్టీ కార్యకర్తలే పంచుకొనేటట్లు చేశారు.
ఎన్నికల ముందు పార్టీ కార్యకర్తల జేబులలో డబ్బు అందించడం కోసమే గదా ఈ పంపిణి అంతా? నిజంగా వరద బాధితులు అందరికి సహాయం అందిస్తే మూడు రోజుల పాటు ఈసేవ కేంద్రాల వద్ద లక్షలాది మంది ప్రజలు రేయంబవళ్ళు పడిగాపులు కాశారు?
అట్లాగే, జీహెచ్ఎంసీ ఎన్నికలకు 15 రోజుల ముందు ఆస్తిపన్నులో 50 శాతం రాయితీ అంటూ ఎత్తుగడ వేశారు. 2016 ఎన్నికల ముందు కూడా ఇటువంటి జిమ్మిక్ చేశారు. రూ 1200 ఆస్థి పన్ను చెల్లించవలసిన వారు రూ 101 చెల్లిస్తే సరిపోతుందని మోసం చేశారు. ఎన్నికలైన తర్వాత పన్నులు కట్టమని జనాన్ని వేధించారు. ఆస్తిపన్ను సవరణ పేరుతో దాదాపు రెండు లక్షల మంది ప్రజలపై రెట్టింపుకు పైగా భారం మోపిన చరిత్ర ఉంది.
నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడం కోసం రూ 20,000 కోట్లతో స్ట్రాటజిక్ రోడ్ డెవెలెప్మెంట్ ప్లాన్ అమలు పరుస్తున్నట్లు ప్రకటించారు. 20 ఫ్లైఓవర్లు, 5 స్కైవేలు, 11 మేజర్ కారిడార్లు, 5 గ్రేడ్ సెపరేట్లతో మొత్తం 2,000 కిమీ కొత్త రహదారులు వేస్తున్నట్లు గొప్పలు చెప్పుకున్నారు. కానీ అందులో నాలుగోవంతు కూడా చేయలేదు. ఇక ట్రాఫిక్ రద్దీ కోసం మూసి నదిపై 42 కిమీ ఆరు లైన్ల రోడ్లు వేస్తామని చెప్పి ఇప్పటి వరకు అందుకు ప్రణాళిక కూడా చేయలేదు.
(సంశేషం)
More Stories
దేశంలో అత్యంత శక్తివంతమైన నేతగా నరేంద్ర మోదీ
లగచర్ల ఘటనలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ అరెస్ట్
తక్షణ చర్యలు చేపట్టాలని కాప్-29లో గుటెరస్ హెచ్చరిక