రోష్ని భూకుంభకోణంలో ఫరూక్, ఒమర్ అబ్దుల్లాలు   

చట్టవిరుద్ధగా భూమిని స్వాధీనం చేసుకుని ఇళ్లు నిర్మించుకున్న వారి జాబితాలో జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా పేర్లను అక్కడి ప్రభుత్వ యంత్రాంగం చేర్చింది. జాబితాలో తమ పేర్లను చేర్చడాన్ని వీరిద్దరూ తీవ్రంగా ఖండించారు. తమను ఇబ్బంది పెట్టేందుకే పేర్లను చేర్చినట్టు ఆరోపించారు. 
 
 ఈ జాబితాలో అక్రమంగా భూములు లబ్ధి పొందిన 400 మంది జాబితాలో పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ మాజీ నాయకులు హసీబ్‌ ద్రాబు, కాంగ్రెస్‌ నాయకులు కేకే ఆమ్లా, జమ్మూ కశ్మీర్‌ బ్యాంక్‌ మాజీ చైర్మన్‌ ఎంవై ఖాన్‌ తదితరులు కూడా ఉన్నారు.  జమ్మూ కశ్మీర్‌ పరిధిలోని భూ ఆక్రమణదారులకు యాజమాన్య హక్కులు కల్పించేందుకు 2001లో అప్పటి ఫారూక్‌ అబ్దుల్లా ప్రభుత్వం ‘జమ్మూ కశ్మీర్‌ స్టేట్‌ ల్యాండ్స్‌ వెస్టింగ్‌’ పేరిట ఓ చట్టం తీసుకొచ్చింది. 
 
ప్రధానంగా రాష్ట్రంలో విద్యుత్‌ ప్రాజెక్ట్‌ల కోసం అవసరమైన నిధులను సమీకరించడంలో భాగంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పుకున్న నాటి ఫారూక్‌ అబ్దుల్లా ప్రభుత్వం ఆ చట్టాన్ని ‘రోష్ణి’ చట్టంగా పేర్కొంది. ఈ చట్టం దుర్వినియోగం అయిందని, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ చట్టానికి ఎలాంటి విలువ లేదంటూ రాష్ట్ర గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ 2018లో ఈ చట్టాన్ని కొట్టి వేశారు. 
 
 రోష్ణి చట్టం పేరుతో జరిగిన అక్రమ భూ లావాదేవీలపై దర్యాప్తు జరపాలంటూ సీబీఐని అక్టోబర్‌ 12వ తేదీన జమ్మూ కశ్మీర్‌ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రోష్ణి చట్టం కింద జరిగిన  దాదాపు రూ 25 వేల కోట్ల కుంభకోణంలో ప్రతి ఎనిమిది వారాలకోసారి దర్యాప్తు పురోగతి నివేదికను సమర్పించాలని కూడా కోరింది. 
 
మాజీ రెవెన్యూ మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు రామన్‌ భల్లా పేరును కూడా ప్రత్యేకించి ప్రస్తావించిన హైకోర్టు, దర్యాప్తులో వెలుగులోకి  వచ్చిన అందరి పేర్లను ప్రజలకు అందుబాటులో ఉంచాలని కూడా ఆదేశించింది. ఆ ఆదేశాలను పురస్కరించుకొనే లబ్ధిదారుల పేర్లను సీబీఐ బయట పెట్టింది. వారిలో పీడీపీ నాయకుడు హసీబ్‌ ద్రాబు ఉన్నారు.
 
జమ్మూకశ్మీర్ అధికార యత్రాంగం తయారు చేసిన రోష్ని కుంభకోణం జాబితాలో తమ పేర్లు ఉండడంపై ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ.. తన ఒక్కడి ఇల్లే కాని, ఆ ప్రాంతంలో వందలాది ఇళ్లు ఉన్నాయని పేర్కొన్నారు. దీనిపై తాను మాట్లాడబోనని, తనను ఇబ్బందులకు గురిచేసేందుకు ఇలా చేస్తున్నారని ఆరోపించారు. ఏం చేసుకుంటారో చేసుకోవాలని అన్నారు. 
 

నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ) నేత దేవేందర్ రాణా మాట్లాడుతూ.. 2001లో ఫరూక్ అబ్దుల్లా ప్రభుత్వమే ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. అయితే, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దీనిని సవరించాయని పేర్కొన్నారు. ఇది ఉప న్యాయమూర్తి పరిధిలో ఉండడంతో ఇతర ప్రభుత్వాలను తాము నిందించబోమని స్పష్టం చేశారు.