లవ్ జీహాద్ ఆర్డినెన్స్‌కు యూపీ కేబినెట్ ఆమోదం 

 ‘‘లవ్ జీహాద్’’కు వ్యతిరేకంగా రూపొందించిన ఓ ఆర్డినెన్స్‌కు ఉత్తర ప్రదేశ్ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ చట్టం కింద నేరం రుజువైతే ఒకటి నుంచి పదేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. బలవంతపు మత మార్పిడులకు చెక్ పెట్టేందుకే ఈ మేరకు చట్టం చేసినట్టు యూపీ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దేశంలో మొదటగా ఇటువంటి చట్టం రాబోవడం గమనార్హం. 
 
‘‘ఈ ఆర్డినెన్స్ కింద ఓ వ్యక్తి బలవంతపు మతమార్పిడికి పాల్పడినట్టు రుజువైతే 1-5 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.15 వేల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలకు చెందిన మహిళలు, మైనార్టీల మతమార్పిడికి పాల్పడితే 3 నుంచి పదేళ్ల పాటు జైలుశిక్షతో పాటు రూ. 25 వేల జరిమానా విధిస్తారు..’’ అని యూపీ మంత్రి సిద్ధార్థ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. 
 
కాగా ‘‘లవ్ జీహాద్‌’’కు వ్యతిరేకంగా చట్టం చేయాలంటూ హోంశాఖ ఇప్పటికే న్యాయ శాఖకు ప్రతిపాదన పంపింది. లవ్ జీహాద్‌కు వ్యతిరేకంగా కఠిన చట్టం తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం యోచిస్తోందంటూ గత నెలలో జౌన్‌పూర్ ఉపఎన్నికల ప్రచారం సందర్భంగా ముఖ్యమంత్రి  యోగి ఆదిత్యనాథ్ ప్రకటించిన నేపథ్యంలో తాజా ఆర్డినెన్స్ తీసుకురావడం గమనార్హం.   
 మ‌త మార్పిడి వ్య‌తిరేక బిల్లు 2020ని రాబోయే శీతాకాల అసెంబ్లీ స‌మావేశాల్లో ప్ర‌వేశ‌పెట్టే అవ‌కాశాలు ఉన్నాయి. ప్రేమ పేరుతో జ‌రుగుతున్న మ‌త మార్పిళ్ల‌కు చెక్ పెట్ట‌డానికి వ్యూహాన్నిర‌చించాల‌ని, దీనికోసం ఆర్డినెన్స్ తీసుకురావాల‌ని ఇంత‌కుముందు యూపీ సీఎం ఆదిత్య‌నాథ్ అధికారుల‌ను ఆదేశించారు.