కరోనాతో అహ్మద్ పటేల్ కన్నుమూత

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి సన్నిహిత రాజకీయ సలహాదారుడు, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ (71) కరోనా వైరస్ సోకి కన్నుమూశారు. గురుగ్రామ్ లోని మేదాంత ఆస్పత్రిలోని ఐసియులో కరోనా వైరస్ తో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున 3.30కి చనిపోయారు. 
 
గత నెల 1న ఆయనకు కరోనా సోకగా  మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వున్నారు. గత కొద్ది రోజులుగా ఆయన శరీరంలో పలు అవయవాలు సవ్యంగా పనిచేయడకపోవడంతో ఆరోగ్యం క్షీణించింది. చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారు జామున కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు ఫైజల్‌ పటేల్‌ ట్వీట్‌ చేశారు. 
 
‘నా తండ్రి అహ్మద్‌ పటేల్‌ ఈ రోజు తెల్లవారు జామున 3.30గంటలకు మృతి చెందారు. ఆయన అకాల మరణం మమల్ని తీవ్ర ఆవేదనకు గురి చేసింది. నెల రోజుల క్రితం కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. అనంతరం ఆరోగ్యం క్షీణించడంతో కన్నుమూశారు’ అంటూ భావోద్వేగపూరిత ట్వీట్‌ చేశారు.
 
అహ్మద్ పటేల్ మూడు సార్లు లోక్ సభకు, ఐదు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. అహ్మద్ పటేల్ గుజరాత్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1985లో రాజీవ్ గాంధీ ప్రధాని మంత్రిగా ఉన్నప్పుడు పటేల్ పార్లమెంటరీ కార్యదర్శిగా పని చేశారు. 1976లో గుజరాత్ నుంచి కాంగ్రెస్ తరఫున స్థానిక ఎన్నికలలో పోటీ చేసి రాజకీయ అరంగేట్రం చేశారు.
 
1949 ఆగస్టు 21 గుజరాత్ లో భహరుచ్ ప్రాంతంలో మహ్మద్ ఇషక్జీ పటేల్, హవాబేన్ మహ్మద్ భాయి అనే దంపతులకు జన్మించారు. 1977లో భహరుచ్ ప్రాంతం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పటేల్ లోక్ సభకు పోటీ చేయాలని అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ సూచించారు. భహరుచ్ నియోజకవర్గం నుంచి 1980, 1984లో ఎంపి గెలిచారు. 2004 నుంచి 2014 యుపిఎ ప్రభుత్వంలో కీలక వ్యక్తిగా పని చేశారు.  
 ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ఒక ట్వీట్‌లో ప్రధాని మోదీ… అహ్మద్ పటేల్ సమాజానికి ఏళ్ల తరబడి సేవలు అందించారని కొనియాడారు. అలాగే కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేశారన్నారు. తాను అతని కుమారుడు ఫైజల్‌కు ఫోనుచేసి, వారి కుటుంబాన్ని పరామర్శించానని, సానుభూతి ప్రకటించానని తెలిపారు. ఈశ్వరుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుంటున్నానని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

సోనియా గాంధీ పటేల్ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘‘అత్యంత విశ్వాసపాత్రుడు, మంచి స్నేహితుడు. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. గొప్ప కామ్రేడ్‌ను నేను కోల్పోయాను’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు. ‘‘అహ్మద్‌ పటేల్‌ కాంగ్రెస్‌ పార్టీ కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. విశ్వాసానికి, అంకితభావానికి ఆయన మారుపేరు. పూర్తి నిబద్ధతతో తన కర్తవ్యాన్ని నెరవేర్చేవారు” అంటూ నివాళులు అర్పించారు.