శాస్త్రీయ ప్రమాణాలతో సురక్షితంగా ఉన్న కరోనా టీకాను మాత్రమే దేశ ప్రజలకు ఇవ్వనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారు. వ్యాక్సిన్ భద్రతతో పాటు వేగం కూడా ప్రాముఖ్యమైందని, వ్యాక్సిన్ పంపిణీ విధానానికి అన్ని రాష్ట్రాల సహకారంతో కార్యాచరణ రూపొందిస్తున్నామని ప్రధాని చెప్పారు.
ఇవాళ 8 రాష్ట్రాల సీఎంలతో జరిగిన వర్చువల్ సమావేశాన్ని ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడుతూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు టీకాలను నిల్వ చేసేందుకు కోల్డ్ స్టోరేజీ సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిపై జరుగుతున్న అన్ని అంశాలను ట్రాక్ చేస్తున్నామని, భారతీయ టీకా అభివృద్ధిదారులు, ఉత్పత్తిదారులతో నిరంతరం సంప్రదింపులు చేస్తున్నామని ప్రధాని తెలిపారు.
ప్రపంచ వ్యాప్తంగా గ్లోబల్ రెగ్యులేటర్లతోనూ టచ్‌లో ఉన్నామని, ఇతర దేశ ప్రభుత్వాలతో, బహుళజాతి సంస్థలతో, అంతర్జాతీయ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రధాని వివరించారు.
ప్రస్తుతం టీకా అభివృద్ధి జరుగుతున్నా ఆ టీకాలు ఎన్ని డోసులు ఉంటాయో తెలియవని, కరోనా టీకా ఒక డోసా లేక రెండు డోసులా లేక మూడు డోసుల్లో వస్తుందా ఇప్పుడే చెప్పలేమని ప్రధాని చెప్పారు. కరోనా వ్యాక్సిన్‌కు ఇంకా ధరను కూడా నిర్ధారించలేదని పేర్కొన్నారు.
ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఇంకా సమాధానం లేదని, కానీ వ్యాక్సిన్ పంపిణీకి కావాల్సిన కార్యాచరణ మాత్రం రూపొందిస్తున్నట్లు ప్రధాని వెల్లడించారు. వ్యాక్సిన్ నిల్వల కోసం కోల్డ్ స్టోరేజ్‌లను రాష్ట్ర ప్రభుత్వాలే ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
అతి సూక్ష్మస్థాయిలోనూ ఎలా వ్యాక్సిన్ పంపిణీ చేపడుతారోరాష్ట్ర ప్రభుత్వాలు తమ పూర్తి ప్రణాళికలను పంపించాలని సీఎంలను ప్రధాని కోరారు. మీరు అనుభవపూర్వకంగా ఇచ్చే అమూల్యమైన అభిప్రాయాలు తాము నిర్ణయం తీసుకోవడంలో దోహదపడుతుందని మోదీ చెప్పారు.
రాష్ట్రాల క్రియాశీల భాగస్వామ్యాన్ని స్వాగతిస్తామని చెబుతూ టీకా అభివృద్ధి ప్రక్రియ జరుగుతుందని, కానీ రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం నిర్లక్ష్యం వహించరాదని సీఎంలను మోదీ హితవు చెప్పారు. ప్రతి ఒక పౌరుడికి వ్యాక్సిన్ అందించడం కోసం జాతీయ మిషన్ చేపడుతామని స్పష్టం చేశారు.
అయితే ఈ మిషన్ సక్సెస్ కావాలంటే, అన్ని రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేయాలని పేర్కొన్నారు. వ్యూహాత్మకంగా, స్మూత్‌గా, నిరంతర ప్రక్రియలా ఈ మిషన్‌ను చేపట్టాలని మోదీ సూచించారు.
More Stories
బాంగ్లాలో హిందువులపై మారణకాండ పట్ల భారత్ చర్యలు చేపట్టాలి
భగవద్గీతలోని సర్వకాలీన విజ్ఞానం
అమెరికా చదువులపై భారత విద్యార్థుల అనాసక్తి