కరోనా మృతులు 1 శాతంకు తక్కువగా ఉండాలి 

కరోనా మృతుల సంఖ్య 1 శాతానికి కంటే తక్కువగా ఉండేలా, ప్రాణాంతకత రేటు 5 శాతం కంటే తక్కువగా ఉండేలా చూడాలని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు. కంటైన్ మెంట్ జోన్ వ్యూహానికి కొత్తరూపు ఇవ్వాలని కోరారు.

దేశంలో పలు చోట్ల కరోనా కేసులు పెరుగుతున్న సమాచారం నేపథ్యంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ జరిపిన వర్చువల్ సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రుల ముందు 3 పాయింట్లతో కూడిన లక్ష్యం ఉంచారు. అధికారులు తప్పని సరిగా ప్రతివారం రెడ్ జోన్లలో పర్యటించాలని, వారు సేకరించిన డాటాకు అనుగుణంగా ఆయా ప్రాంతాల స్టాటస్‌లో మార్పులు చేయాలని పేర్కొన్నారు.

కాగా, సరిహద్దు రాష్ట్రాల్లో పంట వ్యర్ధాలను తగులబెడుతుండటం దేశ రాజధానిలో కోవిడ్-19 మూడో వేవ్ తీవ్రతకు ప్రధాని కారణమని ఢిల్లీ ముఖ్యమంత్రి అరివింద్ కేజ్రీవాల్ ప్రధానికి తెలిపారు.

తాను ఎప్పటికప్పుడు సెరుం ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన అదర్ పూనంవాలాతో సంప్రదిస్తున్నట్టు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే వివరించారు. వాక్సిన్ సకాలంలో పంపిణీ చేసేందుకు, వ్యాక్సినేషన్ ప్రోగ్రాం సజావుగా సాగేందుకు తమ ప్రభుత్వం టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రధాని దృష్టికి తెచ్చారు.

కొవిడ్‌ వ్యాక్సిన్‌ను ప్రాధాన్యతాక్రమంలో అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలంగాణ  ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు తెలిపారు.  వ్యాక్సిన్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అనే విషయాన్ని నిర్ధారించుకోవాల్సిన అవసరం కూడా ఉందని సూచించారు. 

కాగా, ఈ వర్చువల్ సమావేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తదితరులు పాల్గొన్నారు