సోషల్ మీడియాలో తిరుగులేని ప్రధాని  మోదీ 

సోషల్ మీడియాలో తిరుగులేని ప్రధాని  మోదీ 

దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన రాజకీయ నేతగా సోషల్‌ మీడియాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనసాగుతున్నారు.  ట్విటర్, గూగుల్‌ సెర్చ్, యూట్యూబ్‌ ప్లాట్‌ఫామ్స్‌ల్లో అత్యధిక ట్రెండ్స్‌ మోదీ పేరుపైననే ఉన్నాయి. 

ఆగస్ట్‌ నుంచి అక్టోబర్‌ వరకు సోషల్‌ మీడియా టాప్‌ ట్రెండ్స్‌ను ‘చెక్‌బ్రాండ్స్‌’ సంస్థ నివేదిక రూపంలో వెల్లడించింది. ఈ మూడు నెలల కాలంలో 95 మంది టాప్‌ రాజకీయ నాయకులు, 500 మంది అత్యున్నత ప్రభావశీలురకు సంబంధించిన ట్రెండ్స్‌ను చెక్‌బ్రాండ్స్‌ విశ్లేషించింది. 

దాదాపు 10 కోట్ల ఆన్‌లైన్‌ ఇంప్రెషన్స్‌ ఆధారంగా ఈ తొలి నివేదికను వెలువరించింది. ట్విటర్, గూగుల్‌ సెర్చ్, వికీ, యూట్యూబ్‌ల్లో అత్యధిక ట్రెండ్స్‌ ప్రధాని మోదీ పేరుపైననే ఉన్నాయని పేర్కొంది. 

ఈ నివేదిక ప్రకారం 2,171 ట్రెండ్స్‌తో మోదీ తొలి స్థానంలో నిలవగా, మోదీకి అత్యంత సమీపంగా 2,137 ట్రెండ్స్‌తో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. తదుపరి స్థానాల్లో పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీ ఉన్నారు.

బ్రాండ్‌ స్కోర్‌ విషయంలోనూ 70 స్కోర్‌తో మోదీ తొలి స్థానంలో ఉన్నారు. సోషల్‌మీడియా వేదికలపై ఫాలోవర్స్, ట్రెండ్స్, సెంటిమెంట్స్, ఎంగేజ్‌మెంట్, మెన్షన్స్ ఆధారంగా బ్రాండ్‌ స్కోర్‌ను నిర్ధారిస్తారు.

ఈ స్కోర్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా 36.43 స్కోర్‌తో రెండో స్థానంలో ఉన్నారు. ఆ తరువాత స్థానాల్లో, సోమవారం మరణించిన అస్సాం మాజీ సీఎం తరుణ్‌ గొగోయ్‌ (31.89), అరుణాచల్‌ సీఎం పెమా ఖండూ (31.89), యూపీ సీఎం ఆదిత్యనాథ్‌(27.03) ఉన్నారు.

బ్రాండ్‌ వ్యాల్యూ విషయంలోనూ మోదీనే తొలి స్థానంలో ఉన్నారు. ఆయన బ్రాండ్‌ వాల్యూ రూ. 336 కోట్లు. ఆ తరువాతి స్థానాల్లో అమిత్‌ షా(రూ. 335 కోట్లు), ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌(రూ. 328 కోట్లు) ఉన్నారు. బ్రాండ్‌ వాల్యూని ఫాలోవర్లు, ఎంగేజ్‌మెంట్స్, ట్రెండ్స్‌ ఆధారంగా నిర్ధారిస్తారు.

అనంతరం ఆ వాల్యూ నుంచి వ్యతిరేక కామెంట్ల, వ్యతిరేక సెంటిమెంట్ల వాల్యూని తగ్గిస్తారు. ‘ప్రధాని మోదీపై 25% వ్యతిరేక సెంటిమెంట్‌ ఉన్నప్పటికీ.. ఎంపిక చేసిన 95 మంది రాజకీయ నేతల్లో ఆయన బ్రాండ్‌ వాల్యూనే అత్యధికంగా ఉంది’ అని ‘చెక్‌బ్రాండ్‌’ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అనూజ్‌ సాయల్‌ తెలిపారు.