ఒవైసీకి వేసే ప్రతి ఓటు భారత్‌కు వ్యతిరేకమే 

ఓవైసీకి వేసే ప్రతి ఓటు భారత్‌కు, ఇక్కడి విలువలకూ వ్యతిరేకమే అని బిజెపి ఎంపీ, యువమోర్చ జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య హెచ్చరించారు. నగరంలో జరుగుతున్న జీహెచ్‌ఎమ్‌సీ ఎన్నికలలో బిజెపి అభ్యర్థులకు ప్రచారం చేస్తూ ఓవైసీ తీవ్ర ఇస్లామిజమ్, వేర్పాటువాదం, అతివాదానికి చెందిన భాషను మాట్లాడతారని ధ్వజమెత్తారు. 
 
స్వరం కూడా అదే. విచ్ఛినకర మతపరమైన రాజకీయాలను ప్రతి ఒక్కరూ ఎదిరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.  మజ్లీస్ పార్టీ అధినేత ఓవైసీ పాత నగరంలో అభివృద్ధి జరగనీయలేదంటూ ఆరోపించారు. అభివృద్ధి గురించి అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఓవైసీలు మాట్లాడటం హాస్యాస్పదం అంటూ ఎద్దేవా చేశారు. 

పాత నగరంలో వారు అభివృద్ధిని జరగనీయలేదని, మౌలిక వసతుల్ని రానీయలేదని, పాత నగరంలో వారు ప్రవేశపెట్టింది రోహింగ్యాలను మాత్రమే అంటూ ధ్వజమెత్తారు. అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు వారికి లేదని స్పష్టం చేశారు. దేశంలో మోదీ పాలన ఉందని, నిజాం పాలన కాదని హెచ్చరించారు. 

ఈ రోజు తెలంగాణాలో నరేంద్ర మోదీ ప్రజా అనుకూల పాలన కేసీఆర్ ఫార్మ్ హౌస్ పాలనకు మధ్య పోరాటం జరుగుతోందని పేర్కొన్నారు.  గ్రేటర్‌ ఎన్నికల్లో ప్రజలు తమకు ఒక్క అవకాశం ఇస్తే భాగ్యనగరం రూపురేఖలు మారుస్తామని, పాతబస్తీలో అరాచక శక్తులను తరిమికొడతామని హామీ ఇచ్చారు. 

తాను భాగ్యలక్ష్మి దేవాలయానికి వెళ్తే మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని అన్నారని, తనను రెచ్చగొడితే భాగ్యలక్ష్మి దేవాలయాన్ని అడ్డాగా చేసుకుంటానని సవాల్‌ విసిరారు. దమ్ముంటే తనను అరెస్టు చేయాలన్నారు. సోమవారం బీజేవైఎం ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లో ఏర్పాటు చేసిన ‘ఛేంజ్‌ హైదరాబాద్‌’ కార్యక్రమంలో  వెబ్‌సైట్‌, సంతకాల సేకరణను ప్రారంభించారు.

టీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ పార్టీలు రాష్ట్రంలో కుటుంబ పాలన చేస్తున్నాయని తేజస్వి ఆరోపించారు. హైదరాబాద్‌ను ఇస్తాంబుల్‌ చేస్తానని కేసీఆర్‌ చెప్పారని, ఆ దేశంలో ఎవరి పాలన ఉందో ప్రజలు గుర్తించాలని కోరారు. ఆవాజ్‌ యోజన కింద 2 లక్షల గృహ నిర్మాణాల కోసం కేంద్రం రూ.1500 కోట్లు తెలంగాణ ఇచ్చిందని, ఇళ్లు ఎక్కడ నిర్మించారని, ఆ నిధులు ఏమి చేశారని ప్రశ్నించారు.