భారత్ యువ ప్రజాస్వామిక దేశం  

భారత దేశాన్ని యువ ప్రజాస్వామిక దేశంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. మన దేశానికి 2014 నుంచి 2029 మధ్య కాలం చాలా విలువైనదని చెప్పారు. దేశాభివృద్ధి విషయంలో గడచిన ఆరు సంవత్సరాలు చరిత్రాత్మకమని తెలిపారు. 

మిగిలిన కాలంలో చేయవలసినది చాలా ఉందని చెప్పారు. దేశ రాజధానిలో పార్లమెంటు సభ్యుల కోసం 76 బహుళ అంతస్థుల ఫ్లాట్లను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించిన సందర్భంగా మోదీ మాట్లాడారు. 16వ లోక్‌సభ కాలం 2014 నుంచి 2019 వరకు ఉంది. 17వ లోక్‌సభ పదవీ కాలం 2019-24, కాగా 18వ లోక్‌సభ పదవీ కాలం 2024-29. దీనిని ఓ వ్యక్తి వయసుతో పోల్చుతూ మోదీ మాట్లాడారు. 

యువత జీవితంలో 16, 17, 18 సంవత్సరాల వయసు చాలా ముఖ్యమైనదని చెప్పారు. అదేవిధంగా భారత దేశం వంటి యువ దేశానికి 16వ లోక్‌సభ నుంచి 18వ లోక్‌సభ పదవీ కాలం వరకు ఉన్న కాలం చాలా విలువైనదని పేర్కొన్నారు. 16వ లోక్‌సభ కాలం మన దేశ అభివృద్ధి విషయంలో చరిత్రాత్మకమైనదని తెలిపారు. 17వ లోక్‌సభ కాలంలో ఇప్పటి వరకు అనేక నిర్ణయాలు తీసుకున్నందువల్ల చరిత్రలో స్థానం సంపాదించిందని పేర్కొన్నారు. 

నూతన దశాబ్దంలో మన దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడంలో చాలా ముఖ్యమైన పాత్రను 18వ లోక్‌సభ కూడా పోషిస్తుందనే నమ్మకం తనకు ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. మనం సాధించవలసినది ఇంకా చాలా ఉందని తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్, ఆర్థిక లక్ష్యాలు, అనేక ఇతర లక్ష్యాలను ఈ సమయంలో సాధించవలసి ఉందని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

 జమ్మూ-కశ్మీరు కేంద్ర పాలిత ప్రాంతంలో అనేక కొత్త చట్టాలు అమల్లోకి రావడంతో ప్రజలు మొదటిసారి ప్రధాన అభివృద్ధి పథంలో చేరారని చెప్పారు. అధికరణ 370 రద్దును మోదీ పరోక్షంగా ప్రస్తావించారు. జీఎస్‌టీ చట్టాన్ని, దివాలా స్మృతిని అమల్లోకి తీసుకొచ్చామని గుర్తు చేశారు.

ఈ ఫ్లాట్ లను న్యూ ఢిల్లీ లోని డాక్ట‌ర్. బి.డి.మార్గ్ లో కట్టారు. 80 ఏండ్లు పైబడిన ఎనిమిది పాత బంగళాలకు చెందిన భూమిలో ఈ 76 ఫ్లాట్‌ లను నిర్మించారు. “ఎంపీ ల గృహ వ‌స‌తి చాలా కాలంగా ప‌రిష్కారం కాకుండా అలాగేఉంది . దానిని ఇప్పుడు ప‌రిష్క‌రించ‌డం జ‌రిగింద‌ని ” ప్ర‌ధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పారు.

ద‌శాబ్దాల నాటి స‌మ‌స్య‌లను త‌ప్పించుకు తిరిగితే స‌మ‌సిపోవు, వాటికి ప‌రిష్కార మార్గాల‌ను అన్వేషిస్తేనే అవి కొలిక్కి వ‌స్తాయి అని ఆయ‌న అన్నారు. చాలా సంవ‌త్స‌రాలుగా అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు ఢిల్లీలో అనేకం ఉన్నాయి, వాటిని ఈ ప్ర‌భుత్వం చేప‌ట్టి అనుకున్న కాలాని కంటే ముందుగానే పూర్తి చేసింది అని చెప్తూ, వాటిని ఒక‌ దాని త‌రువాత మ‌రొక‌టి గా ఆయ‌న ప్ర‌స్తావించారు.

చాలా కాలం పాటు ప‌రిష్కారం కాకుండా ఉన్న కేంద్రీయ స‌మాచార సంఘం (సిఐసి) కొత్త భ‌వ‌నాన్ని, ఇండియా గేట్ స‌మీపం లో యుద్ధ స్మార‌కాన్ని, జాతీయ ర‌క్ష‌కభ‌ట స్మార‌కాన్ని ఈ ప్ర‌భుత్వం నిర్మించిందని ఆయ‌న అన్నారు.