అస్సాం మాజీ సీఎం తరుణ్ గొగాయ్ మృతి 

అస్సాం మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత తరుణ్ గొగోయ్ మృతి చెందారు. ఆయన వయస్సు 86 సంవత్సరాలు. శనివారం ఊపిరి పీల్చడం కష్టం కావడంతో ఆయన ఆరోగ్యం విషమించింది. 
క‌రోనా బారిన ప‌డ‌టంతో గ‌త నెల‌లో త‌రుణ్ గొగోయ్ గువాహ‌టి మెడిక‌ల్ కాలేజ్ అండ్  ఆస్ప‌త్రిలో చేరారు. అప్ప‌టి నుంచి అక్క‌డే చికిత్స పొందుతున్న ఆయ‌న ఆరోగ్యం శ‌నివారం ఒక్కసారిగా విష‌మించింది. అస్సాంలో కరోనా బారిన పడిన 25 మంది శాసనసభ్యులలో ఆయన ఒకరు కావడం గమనార్హం.
శ్వాస తీసుకోవ‌డానికి తీవ్రంగా ఇబ్బంది ప‌డుతుండ‌టంతో శ‌నివారం నుంచి ఆయ‌న‌ను వెంటిలేట‌ర్‌పై ఉంచారు. ఆదివారం కొద్దిగా కోలుకున్న‌ట్లే క‌నిపించినా ఇవాళ ప‌రిస్థితి మ‌రింత విష‌మించింద‌ని వైద్యులు తెలిపారు.
‘ఈ ఉద‌యం త‌రుణ గొగోయ్ ఆరోగ్య ప‌రిస్థితి ప‌రిశీలించాం. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్యం అత్యంత విష‌మంగా ఉన్న‌ది. మేం ఇవాళ ఆయ‌న‌కు డయాల‌సిస్ నిర్వ‌హించాల‌ని భావించాం. కానీ ఆయ‌న‌ ఆరోగ్య ప‌రిస్థితి అందుకు స‌హ‌క‌రించేలా లేక‌పోవ‌డంతో మానుకున్నాం. నిన్న‌టితో పోల్చితే ఇవాళ ఆయ‌న ఆరోగ్యం మ‌రింత విష‌మంగా ఉంది’ అని ఆస్ప‌త్రి సూప‌రింటెండెంట్ అభిజీత్ శ‌ర్మ ఈ ఉదయం తెలిపారు.
డిబ్రుగర్ పర్యటననో ఉన్న అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద సోనావాలా గొగాయ్ ఆరోగ్యం విషమించిందని తెలుసుకోగాని తన పర్యటనను రద్దుచేసుకొని రాష్ట్ర రాజధానికి తిరిగివచ్చి ఆయన కుటుంభం సభ్యులను ఓదార్చారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పాటు పలువురు రాజకీయ నాయకులు పార్లమెంట్ సభ్యుడైన ఆయన కుమారుడు గౌరవ్ గొగాయ్ కి ఫోన్ చేసి ఆయన ఆరోగ్యం గురించి ఈ రోజు విచారించారు.
2001లో అస్సాంలో కాంగ్రెస్ ను విజయం వైపు నడిపించిన ఆయన వరుసగా మూడు పర్యాయాలు పార్టీని గెలిపించి, 16 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఇటీవల కాలంలో అస్సాంలో అత్యంత ప్రజాదరణ పొందిన రాజకీయ నాయకుడిగా కొనసాగారు. ఆయన ఆరుసార్లు పార్లమెంట్ కు ఎన్నికయ్యారు.