`హిందుస్థాన్’ పదంపై ఎంఐఎం ఎమ్యెల్యే రగడ 

కొత్తగా ఎన్నికైన ఎఐఎంఐఎం శాసనసభ్యుడు అఖ్తరుల్ ఇమాన్ బీహార్ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం సందర్భంగా `హిందుస్థాన్’ అనే పదం వాడడానికి విముఖత వ్యక్తం చేస్తూ కలకలం సృష్టించారు. తాను ఉర్దూలో చేసే ప్రమాణ పత్రంలో రాజ్యాంగంలో పేర్కొన్న ప్రకారం భారత్ అనే పదమే ఉండాలి తప్ప హిందుస్థాన్‌ అనే పదం ఉండకూడదంటూ ఆయన పట్టుపట్టడంతో సభలో కొద్దిసేపు అలజడి చెలరేగింది.

ఎంఐఎం రాష్ట్ర అధ్యక్షుడు కూడా అయిన అఖ్తరుల్ ఇమాన్ సోమవారం అసెంబ్లీలో ప్రొటెమ్ స్పీకర్ జితన్ రామ్ మాంఝి సమక్షంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ఉర్దూలో ప్రమాణం చేయడం ప్రారంభించిన ఆయన తాను హిందుస్థాన్ అని పలుకబోనని, భారత్ అనే సంబోధిస్తానని స్పష్టం చేశారు.

ఈ హఠాత్పరిణామానికి గందరగోళానికి గురైన ప్రొటెమ్ స్పీకర్ ఉర్దూలో ప్రమాణం చేసేటప్పుడు హిందుస్థాన్ అనే పదం వాడడం సంప్రదాయమని నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. అయితే ఇమాన్ ససేమిరా అనడంతో భారత్ అనే పదాన్ని వాడడానికి మాంఝి అనుమతించారు. 

కాగా..సభ వెలుపల ఇదే విషయమై విలేకరులు ఇమాన్‌ను ప్రశ్నించారు. సాధారణంగా ప్రజలంతా హిందుస్థాన్‌గా మన దేశాన్ని వ్యవహరిస్తుండగా ఆ పదాన్ని పలుకడానికి వచ్చిన ఇబ్బందేమిటని ఆయనను అడిగారు. దీనికి ఇమాన్ సమాధానమిస్తూ తానుకేవలం అభ్యంతరాలు మాత్రమే లేవనెత్తానని, ఏ భాషలోనైనా రాజ్యాంగ పీఠికను చదివేటప్పుడు భారత్ అనే పదాన్ని చదువుతామని ఆయన చెప్పారు. 

హిందుస్థాన్ అనే పదాన్ని వాడడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని, ఇక్బాల్ రచించిన ప్రఖ్యాత గేయం సారే జహా సే అచ్చా, హిందుస్థాన్ హమారాను చదువుతూ తాము పెరిగామని ఆయన గుర్తు చేశారు. సంస్కృతంలో ప్రమాణ స్వీకారం చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ ఖాన్‌ను ఆయన అభినందిస్తూ అది ఆయన వ్యక్తిగత ఎంపికని చెప్పారు. 

కాగా  ఎంఐఎం ఎమ్మెల్యే ఇమాన్ చర్యపై అధికార ఎన్‌డిఎ సభ్యులు మండిపడ్డాయిరు. హిందుస్థాన్ అనే పదాన్ని ప్రజలంతా వాడుకలో ఉపయోగిస్తారని, కాని కొందరు వ్యక్తులు మాత్రం దీనిపై అనవసర వివాదాలు సృష్టిస్తారని జెడియు ఎమ్మెల్యే మదన్ సాహ్ని ధ్వజమెత్తారు. 

బిజెపి ఎమ్మెల్యే నీరజ్ సింగ్ బబ్లూ ఇమాన్ చర్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ  హిందుస్థాన్ అనే పదాన్ని ఉచ్ఛరించడానికి ఇష్టపడని వారు పాకిస్థాన్‌కు వెళ్లిపోవచ్చంటూ దుయ్యబట్టారు.