పోలీస్ ఆర్డినెన్సుపై కేరళ సీఎం వెనుకడుగు 

తీవ్రమైన ప్రజా వ్యతిరేకత రావడంతో నిరంకుశ కేరళ పోలీస్ చట్టం సవరణ ఆర్డినెన్స్ అమలును నిలిపివేస్తున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
‘సోషల్ మీడియా విస్తృత దుష్ప్రచారానికి కళ్లెం వేసేందుకు కేరళ పోలీస్ చట్టాన్ని సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. లేదంటే దుష్ప్రచారం వల్ల వ్యక్తుల స్వేచ్ఛ, గౌరవానికి భంగం కలుగుతుంది. వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రతిష్టకు రాజ్యాంగం భరోసా ఇచ్చింది’ అని ఆ ప్రకటన తెలిపింది.
పోలీసు చట్టం సవరణపై వివిధ వర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వినిపించడం, భయాల వ్యాప్తి జరగడంతో సవరించిన ఆర్డినెన్స్‌ అమలు విషయంలో ముందుకు వెళ్లరాదని ప్రభుత్వం నిర్ణయించినట్టు పేర్కొంది.
దీనిపై అసెంబ్లీలో సమగ్ర చర్చ జరిపి, అన్ని పార్టీల అభిప్రాయాలు విన్నతర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని కూడా తెలిపింది. కాగా, ప్రతిపక్షాల వ్యతిరేకతతో వివాదాస్పదంగా మారిన ఈ ఆర్డినెన్స్‌కు కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ గత శనివారంనాడు ఆమోదం తెలిపారు.
పోలీసు చట్టం సవరణకు వ్యతిరేకంగా తిరువనంతపురంలో కాంగ్రెస్ నిరసనలకు దిగింది. సవరణ చట్టంపై అపోహలు పూర్తిగా నిరాధారమని, భావప్రకటనా స్వేచ్ఛ, నిష్పాక్షిక జర్నలిజానికి తాజా సవరణ ఎంతమాత్రం వ్యతిరేకం కాదని అంటూ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆదివారం గట్టిగా సమర్ధించుకున్నారు. 
 
ఈ సవరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సురేంద్రన్ హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేసిన కొద్దిసేపటికే దీనిని ఉపసంహరించు కొంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం గమనార్హం. అస‌భ్యక‌ర‌మైన పోస్టులు చేసేవారిపై పోలీసులు చ‌ర్య‌లు తీసుకునేలా కేరళ  ప్ర‌భుత్వం ఓ ఆర్డినెన్స్‌ తీసుకు వచ్చింది. 
దీని కోసం 2011 కేర‌ళ పోలీసుల చ‌ట్టాన్ని స‌వ‌రించాల‌నుకున్న‌ది. కొత్త చ‌ట్టంలో పొందుప‌రిచిన సెక్ష‌న్ 118-ఏను వ్య‌తిరేకిస్తూ కాంగ్రెస్‌, బీజేపీ ఆందోళ‌న నిర్వ‌హించాయి.  ఆర్డినెన్స్‌పై ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక‌త వ్య‌క్తం కావ‌డం వ‌ల్ల విజ‌య‌న్ ప్ర‌భుత్వం వెనుక‌డుగు వేయక తప్పలేదు.