రేపే బీజేపీలో చేరనున్న విజయశాంతి

ప్రముఖ నటి, ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్‌,  మాజీ ఎంపీ విజయశాంతి కాంగ్రెస్ నుండి నిష్క్రమించి బీజేపీలో చేరడానికి ముహర్తం ఖరారైంది. కాంగ్రెస్ పార్టీ తీరుపై ఎప్పటి నుంచో అసంతృప్తితో ఉన్న ఆమె పార్టీకి గుడ్‌బై చెప్పారు. రేపే బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తున్నది. 
ఆమె మంగళవారం ఢిల్లీ వెళ్లి, బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నట్లు చెబుతున్నారు ఢిల్లీ నుండి తిరిగి వచ్చిన తర్వాత ఆమె గ్రేటర్‌లో బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. గత కొంతకాలంగా విజయశాంతి కాంగ్రెస్‌కు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.ముఖ్యంగా వచ్చే ఏడాది మొదట్లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో ఆమె బీజేపీ అభ్యర్థులకు ప్రచారం చేయనున్నారు.

కొద్ది రోజుల క్రితం విజయశాంతిని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడులు బండి సంజయ్  కుమార్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిలు కలసి బీజేపీలో చేరవలసిందిగా ఆహ్వానించారు.  కాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్  మాణిక్యం ఠాగూర్ విజయశాంతిని బుజ్జగించే ప్రయత్నం చేశాచేసినా ప్రయోజనం లేకపోయింది. 

ఆమె గతంలో వాజపేయి ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో లో 1988బిజెపి తోనే తన రాజకీయ జీవితం ప్రారంభించారు. ఆమెను మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలిగా కూడా అప్పట్లో నియమించారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్, తమిళ్ నాడులలో 1999 లోక్ సభ ఎన్నికలలో ఆమె విస్తృతంగా బిజెపి అభ్యర్థుల కోసం ప్రచారం చేశారు. 

1999లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కడప నుండి లోక్ సభకు పోటీ చేస్తున్నట్లు వార్తలు రావడంతో బిజెపి అభ్యర్థిగా విజయశాంతిని అక్కడి నుండి సోనియాపై పోటీకి దింపాలని బిజెపి నిర్ణయ్హించింది. అయితే సోనియా పోటీ చేయక పోవడంతో విజయశాంతి కూడా పోటీ చేయలేదు. 

తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఉద్యమకోసం ఆమె 2009లో ప్రత్యేకంగా తెలుగు తల్లి పార్టీని ఏర్పాటు చేసి, తర్వాత ఆ పార్టీని టి ఆర్ ఎస్ లో విలీనం చేసి, ఆ పార్టీ అభ్యర్థిగా 2009లో మెదక్ నుండి లోక్ సభకు ఎన్నికయ్యారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఆమె కేసీఆర్ తో కలసి 2011లో లోక్ సభ సభ్యత్వంకు రాజీనామా చేసినా తర్వాత సరైన ఫార్మటు లో లేదని స్పీకర్ ఆమోదించలేదు. 

కేసీఆర్ తో విభేదించి ఫిబ్రవరి, 2014లో టి ఆర్ ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. 2014 ఎన్నికలలో మెదక్ నుండి అసెంబ్లీ కి పోటీ చేసిన గెలుపొందలేక పోయారు. కొంతకాలం రాజకీయాలలో మౌనంగా ఉన్నప్పటికీ, 2018లో రాహుల్ గాంధీ ఆమెను తెలంగాణలో పార్టీ స్టార్ కాంపైనర్ గా నియమించారు. గత ఏడాది లోక్ సభ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ కు దూరంగా ఉంటూ వస్తున్నారు.