బాలీవుడ్ కమెడియన్ భారతీసింగ్ అరెస్ట్

బాలీవుడ్ కమెడియన్ భారతీసింగ్ అరెస్ట్

నిషేధిత డ్రగ్స్ కలిగి ఉన్నారనే ఆరోపణపై బాలీవుడ్ కమెడియన్ భారతీసింగ్ ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు. డ్రగ్స్ సరఫరా చేసే వ్యక్తుల నుండి అందిన సమాచారం మేరకు శనివారం  ఉదయమే ముంబైలోని భారతీసింగ్ నివాసంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు సోదాలు జరిపారు. 

కొద్ది మొత్తంలో గంజాయి లభించడంతో భారతీసింగ్ తోపాటు, ఆమె భర్త హర్ష లింబాచియాలను పలుమార్లు ప్రశ్నించారు. సోదాల్లో  “చిన్న మొత్తంలో గంజాయి” దొరికడంతో స్వాధీనం చేసుకున్న నార్కోటిక్స్ అధికారులు భారతీ సింగ్ తోపాటు ఆమె భర్త హర్ష్ లింబాచియాను ఎన్‌సిబి ముంబై కార్యాలయానికి తరలించారు.

సుశాంత్ సింగ్ ఆత్మహత్యతో బాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. మాజీ ప్రియురాలు అయిన రియా చక్రవర్తి ఏకంగా నెల రోజులపాటు జైలులో గడపాల్సి వచ్చింది. డ్రగ్స్ వినియోగంపై పోలీసులు.. నార్కో వారు వేర్వేరుగా దర్యాప్తులు మొదలుపెట్టడంతో డ్రగ్స్ తీగ లాగితే డొంక కదిలినట్లు అనేక మంది బాలీవుడ్ ప్రముఖుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 

దీంతో డ్రగ్స్ అధికారులు పలువురు ప్రముఖులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడం సంచలనం రేపింది. అయితే ఇవాళ ఉదయం నుండి స్టార్ కమెడియన్ అయిన భారతీసింగ్ ఇంట్లో సోదాలు జరపడం ప్రకంపనలు సృష్టించింది. తిరిగి రాత్రికి ఆమెను అరెస్ట్ చేశారు.

ఈ కేసులో తొలుత రియాచక్రవర్తి అరెస్టు కావడం, నటుడు అర్జున్ రాంపాల్‌ను ఎన్‌సీబీ ప్రశ్నించడం వంటివి చోటుచేసుకున్నాయి. అనంతరం భారతి, హర్ష్ పేర్లు వెలుగుచూశాయి. మాదకద్రవ్యాల వ్యాపారి ఒకరిని ప్రశ్నించినప్పుడు భారతిసింగ్, హర్ష్ పేర్లు బయటకు రావడంతో రంగంలోకి దిగినట్టు ఎన్‌సీబీ వర్గాలు తెలిపాయి.