జల వనరుల సంరక్షణ కోసం నోడల్ ఏజెన్సీలను నియమించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్‌జిటి) ఆదేశించింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వాలు ఇప్పటి వరకు సరైన చర్యలు తీసుకోలేదని పేర్కొంది.
నోడల్ ఏజెన్సీలను ఏర్పాటు చేసిన అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల పర్యవేక్షణలో 2021, జనవరి 31లోగా సమావేశం నిర్వహించాలని ఆదేశించింది. ఈ సమావేశంలో ప్రస్తుత పరిస్థితులపై చర్చించి.. తదుపరి తీసుకోవాల్సిన చర్యలను ఖరారు చేయాలని, అదేవిధంగా జిల్లా అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వాలని తెలిపింది.
అన్ని రాష్ట్రాల నీటి వనరులను క్రమానుగతంగా, సంవత్సరంలో కనీసం మూడు సార్లు పునరుద్ధరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష చేయాలని సెంట్రల్ మానిటరింగ్ కమిటీని కోరింది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది మార్చి 31లోగా మొదటి సమీక్ష జరుగుతుందని ఆశిస్తున్నట్లు ఎన్‌జిటి పేర్కొంది.
`నీటి వనరుల రక్షణకు సంబంధించి ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు సరిపోవని కనుగొన్నాం. తాజాగా మేము ఇచ్చిన ఆదేశాలు నీటి పరిశుభ్రతతో పాటు లభ్యత, జలజీవనం, మైక్రోక్లైమేట్, భూగర్భ జలాల పెంపుదల, నదుల ప్రవాహం సాఫీగా సాగేందుకు సాయపడుతుంది’ అని ఎన్‌జిటి చైర్‌పర్సన్ జస్టిస్ ఎకె.గోయల్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.
ప్రజా వినియోగానికి అనుకూలంగా ఉండేందుకు నీటి వనరులను కాపాడడంలో రాష్ట్ర ప్రభుత్వం ట్రస్టీగా ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. గుర్‌గావ్‌లోని ఘటా సరస్సును పునరుద్ధరించాలని కోరుతూ హర్యానాకు చెందిన రిటైర్డ్ లెఫ్టినెంట్ కల్నల్ సర్వదామన్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఎన్‌జిటి ఈ వ్యాఖ్యలు చేసింది.
More Stories
14 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల తేదీల్లో మార్పు
అస్సాంలో ముసాయిదా ఎన్ఆర్ సిని పునఃపరిశీలించాలి
వీధి కుక్కలకు బిస్కెట్లు వేసి ఉగ్రవాదిని హతమార్చారు