93 శాతం దాటిన కరోనా రికవరీ రేటు

ఒకపక్క కరోనా విజృంబహిష్టు రోజురోజుకూ కొత్త కేసులు పెరిగిపోతున్న సమయంలో తొలిసారిగా 93 శాతానికి పైగా కరోనా రికవరీ రేటు సాధించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ  ప్రకటించింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా శుక్రవారం 46,232 కొత్త కేసులు నమోదయ్యాయి. 
 
వీటితో కలుపుకొని మొత్తం కేసులు 90,50,597కి చేరాయి. అయితే కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య పెరుగుతుండడంతో యాక్టివ్ కేసులు తగ్గుతున్నాయి. దీంతో రికవరీ రేటు క్రమేపీ పెరుగుతూ వస్తోంది.  ఇప్పటివరకు కరోనా బారి నుంచి 84,78,124 మంది కోలుకోగా, ఇంకా 4,39,747 మంది చికిత్స పొందుతున్నారు. 1,32,726 మంది మరణించారు. అంటే మొత్తం కేసుల్లో 93.67 శాతం మంది కోలుకోగా, 4.86 శాతం మంది చికిత్స పొందుతున్నారు. 1.47 శాతం మరణించారు.
ఇదిలా ఉంటే అంతర్జాతీయ నివేదికల ప్రకారం  ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 5,79,70,452కు చేరుకున్నాయి. వారిలో 13,78,839 మంది మరణించగా.. 4,01,84,355 మంది కోలుకున్నారు.
ఇలా ఉండగా, దేశ రాజ‌ధాని ఢిల్లీలో క‌రోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతూ ఉండడంతో అక్క‌డ క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు అయిన ఆర్టీ-పీసీఆర్ టెస్టుల సామ‌ర్థ్యాన్ని పెంచాల‌ని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆదేశించారు. ఆయ‌న ఆదేశాల మేర‌కు ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ మెడిక‌ల్ రిసెర్చ్ (ఐసీఎమ్మార్‌) ఢిల్లీలో రోజుకు 27 వేలుగా ఉన్న ఆర్టీ-పీసీఆర్ ప‌రీక్ష‌ల సామ‌ర్థ్యాన్ని రోజుకు 37,200కు పెంచిన‌ట్లు హోంశాఖ వెల్ల‌డించింది.
రోజువారీ ప‌రీక్ష‌ల సామ‌ర్థ్యం పెంచ‌డంతో సేక‌రించే శాంపిల్స్ సంఖ్య భారీగా పెరిగిందని హోంశాఖ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. న‌వంబ‌ర్ 19న ఒక్క‌రోజే ఢిల్లీలో 30,735 ఆర్టీ-పీసీఆర్ శాంపిల్స్ సేక‌రించిన‌ట్లు అధికారులు తెలిపారు. న‌‌వంబ‌ర్ 15న సేక‌రించిన‌ మొత్తం ఆర్టీ-పీసీఆర్ శాంపిళ్ల సంఖ్య కేవ‌లం 12,055 మాత్ర‌మేన‌ని పేర్కొన్నారు.   ‌