పాక్ హై కమిషన్‌ దౌత్యవేత్తకు భారత్‌ సమన్లు  

జమ్ముకాశ్మీర్‌లో జైషే మహ్మాద్‌ ఉగ్రవాదులు దాడికి యత్నించడంపై పాకిస్తాన్‌ హై కమిషన్‌ దౌత్యవేత్తకు భారత్‌ సమన్లు జారీ చేసింది. స్థానిక ఎన్నికలకు ముందు  లోయలో పలుమార్లు ఉగ్రదాడికి ప్రయత్నాలు చేయడంపై తీవ్రంగా ఆక్షేపించింది.  
జమ్ముకాశ్మీర్‌లోని నగ్రోటా బాన్‌ టోల్‌ ప్లాజా సమీపంలో ఉగ్రవాదులను తీసుకెళ్తున్న ట్రక్కును భద్రతాదళాలు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఇక్కడ శాంతి, భద్రతలను అస్థిరపరిచేందుకు ఉగ్రవాదులు భారీ కుట్రకు ప్రయత్నించారని భారత్ ఆరోపించింది. 
 
అక్కడ భారీగా పట్టుకున్న ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, పేలుడు పదార్థాలే అందుకు నిదర్శనమని విదేశాంగ శాఖ పేర్కొంది. ముఖ్యంగా స్థానిక జిల్లా అభివృద్ధి మండలి ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా జరగకూడదన్న ఉద్దేశంతో ఉగ్రవాద సంస్థ ఈ దాడికి దిగిందని తెలిపింది.

పాకిస్తాన్‌ హై కమిషన్‌ రాయబారికి సమన్లు జారీ చేశామని, ఉగ్ర దాడి ప్రయత్నాలపై నిరసన వ్యక్తం చేశామని, భద్రతా దళాల అప్రమత్తతో ఈ భారీ ఉగ్రదాడిని భగం చేసినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. 
ఉగ్రవాదానికి వ్యతిరేక పోరాటంలో జాతి భద్రతను పరిరక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకునేందుకు ధృఢ నిశ్చయంతో భారత్ స్పష్టం చేసింది. ఉగ్రవాదులకు, ఉగ్రవాద సంస్థలకు మద్దతునివ్వడం పాక్‌ మానుకోవాలని హెచ్చరించింది. 
 
ఇతర దేశాలపై దాడులు చేసేందుకు ఉగ్రవాద సంస్థలకు మౌలిక సదుపాయాలు కల్పించడం ఆపాలని డిమాండ్‌ చేసింది. భారత్‌ను లక్ష్యంగా చేసుకుంటున్న ఉగ్రవాద సంస్థ జైషే మహ్మాద్‌పై తీవ్రంగా మండిపడింది. 2019లో పుల్వామా దాడితో పాటు పలు దాడులకు పాల్పడిందని విమర్శించింది. పాక్‌ తన అంతర్జాతీయ బాధ్యతలకు, ద్వైపాక్షిక సంబంధాలకు కట్టుబడి ఉండాలన్న డిమాండ్‌ను భారత్‌ పునరుద్ఘాటించింది.