కోవిద్ వ్యాక్సిన్, మందులపై పేటెంట్లు వద్దు 

మానవాళిని వణికిస్తున్న కోవిడ్‌-19 మహమ్మారిపై పోరులో పేద వర్థమాన దేశాలకు తోడుగా నిలవాల్సింది పోయి, పేటెంట్ల పేరుతో వాటి మూల్గలను పీల్చి పిప్పిచేసేందుకు ధనిక దేశాలు చేస్తున్న యత్నాలను భారత్‌, దక్షిణాఫ్రికా ఇతర వర్థమాన దేశాలు వ్యతిరేకించాయి. 
 
సంపన్న దేశాలు పేటెంట్‌ హక్కులను ప్రయోగించడం వల్ల కోవిడ్‌ వ్యాక్సిన్‌, మందులు, వెంటిలేటర్లు, డయాగస్టిక్‌ కిట్స్‌, మాస్కులు, గౌనులు వంటి వ్యక్తిగత రక్షణ పరికరాలు వర్థమాన దేశాల ప్రజలకు అందుబాటులో లేకుండా పోతాయని, కాబట్టి వీటికి పేటెంట్‌ను మినహాయించాలని డబ్ల్యుటివో వేదికగా భారత్‌, దక్షిణాఫ్రికా పిలుపునిచ్చాయి. 
 
పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీలో అత్యవసర మందులను మేథో సంపత్తి హక్కుల నుంచి మినహాయింపు కోరే హక్కు డబ్ల్యుటివో సభ్య దేశాలకు ఉందని అవి వాదించాయి. అయితే, ఈ వాదనను అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌, జపాన్‌ వ్యతిరేకిస్తున్నాయి. 
 
ఐరాసకు చెందిన ప్రపంచ మేధోసంపత్తి సంస్థ (డబ్ల్యుఐపిఒ)లోని 183 సభ్య దేశాలకు గాను మెజార్టీ దేశాలు ఈ పేటెంట్‌ హక్కులను వ్యతిరేకిస్తున్నాయి. అమెరికా నిర్వచించే పేటెంట్‌ చట్టాలను ప్రపంచ దేశాలపై రుద్దడం ఎంతవరకు న్యాయమని అవి ప్రశ్నిస్తున్నాయి. 
 
మెజార్టీ ప్రపంచ ప్రజానీకం ఇమ్యూనిటీ (రోగ నిరోధకత)ని సంతరించుకునేంతవరకు, వ్యాక్సిన్‌ విస్తృతంగా అందరికీ అందుబాటులోకి వచ్చేంతవరకు కోవిడ్‌ వ్యాక్సిన్‌, మందులు, పరికరాలపై పేటెంట్‌ మినహాయింపు కొనసాగాల్సిందేనని వర్థమాన దేశాల తరపున పనిచేసే సౌత్‌ సెంటర్‌ ఎగ్జిక్యుటివ్‌ డైరక్టర్‌ కార్లాస్‌ కరియా కోరారు. 
 
పేటెంట్‌ హక్కుల వల్ల వర్ధమాన దేశాల్లో కోవిడ్‌ా19 చికిత్సలు, వ్యాక్సిన్‌లు సులువుగా అందరికీ అందుబాటులోకి రాకుండా పోతాయని, ఇది తీవ్ర వినాశకర పరిణామాలకు దారితీసే ప్రమాదముందని కరియా ఆందోళన వ్యక్తం చేశారు. 
 
వాతావరణ మార్పులు, మందుల సౌలభ్యం, ఆహార భద్రత, మేథో సంపత్తి హక్కులకు సంబంధించి వర్ధమాన దేశాలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి జెనీవా కేంద్రంగా ఉన్న ఈ సౌత్‌ సెంటర్‌ పని చేస్తోంది. 2006లో బహుళజాతి కంపెనీలు భారత్‌లో హెచ్‌ఐవి/ఎయిడ్స్‌ డ్రగ్స్‌పై పేటెంట్‌కు దరఖాస్తు చేసినప్పుడు భారత ప్రభుత్వం, అంతర్జాతీయ న్యాయవాదుల బృందం తీవ్ర అభ్యంతరం తెలిపాయి. 
 
ఈ మందులపై పేటెంట్‌ హక్కు కల్పించడమంటే అత్యవసర మందులను వర్థమాన దేశాలకు అందుబాటులో లేకుండా చేయడమేనని, ఇది ఆ దేశాల్లోని ప్రజారోగ్య వ్యవస్థను దెబ్బతీయడమేనని అవి పేర్కొన్నాయి. భారత్‌ చౌకగా జనరిక్‌ మందులు తయారు చేసి ఇతర వర్ధమాన దేశాలకు అందిస్తున్నది. దీనిని అడ్డుకోవడానికి భారత్‌ను డబ్ల్యుటివోలోని ట్రిప్స్‌్‌ అగ్రిమెంట్‌కి కట్టుబడాలంటూ కొత్త చట్టాన్ని సంపన్న దేశాలు తీసుకొచ్చాయి.