చివరి దశలో ఎన్‌పిఆర్‌ షెడ్యూల్‌, ప్రశ్నా పత్రం  

నేషనల్‌ పాపులేషన్‌ రిజిస్టర్‌ (ఎన్‌పిఆర్‌) షెడ్యూల్‌, ప్రశ్నా పత్రం చివరి దశలో ఉన్నాయని, త్వరలో ఖరారు చేయబడుతుందని రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌జిఐ) పేర్కొంది. ఈ నేపథ్యంలో తేదీ గురంచి సమాచారం అందుబాటులో లేదని ఆర్‌జిఐ తెలిపింది. 
 
ప్రస్తుతం ఎన్‌పిఆర్‌గా మార్చిన 2021 జనాభా లెక్కింపు మొదటి దశ ఎప్పుడు చేపట్టనున్నారు… ఆ తేదీ గురించి సమాచారం కావాలంటూ ఆర్‌టిఐ చట్టం కింద ‘ద హిందూ’ దాఖలు చేసిన పిటిషన్‌కు ఆర్‌జిఐ పైవిధంగా సమాధానమిచ్చింది. 
 
మొదట ఎన్‌పిఆర్‌ను ఈ ఏడాది ఏప్రిల్‌లో చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఎన్‌పిఆర్‌, సిఎఎలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు తీవ్రతరం కావడం, కరోనా మహమ్మారి కారణంగా ఈ కార్యక్రమం నిరవధికంగా వాయిదా పడింది. ఎన్‌పిఆర్‌, జనాభా లెక్కింపు మొదటి దశలో భాగంగా నివాసాల జాబితా, జనాభా లెక్కింపు ఏప్రిల్‌ – సెప్టెంబర్‌ మధ్య ఏకకాలంలో నిర్వహించాలని కేంద్రం తెలిపింది.
 
ఏప్రిల్‌ 1న మేఘాలయ, అండమాన్‌ నికోబార్‌ దీవులు, లక్ష ద్వీప్‌, న్యూఢిల్లీ మునిసిపల్‌ కౌన్సిల్‌ (ఎన్‌డిఎంసి) ప్రాంతాలలో ఈ ప్రక్రియను మొదట ప్రారంభించాల్సి ఉంది. అయితే ఎన్‌పిఆర్‌ ఖరారు చేయబడుతోందని, దీంతో తేదీ గురించి సమాచారం లేదని ఆర్‌టిఐ కింద అడిగిన ప్రశ్నకు నవంబర్‌ 17న ఆర్‌జిఐ సమాధానమిచ్చింది.