జమ్మూకశ్మీరులో నలుగురు ఉగ్రవాదుల హతం

జమ్మూ కశ్మీరులోని నగరోటా జిల్లా బన్ టోల్ లాజా వద్ద ఉగ్రవాదులకు, భద్రతాబలగాలకు మధ్య గురువారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటరులో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. 
 
ఉగ్రవాదులు జమ్మూ నుంచి శ్రీనగర్ కు బస్సులో వెళుతుండగా నగరోటా వద్ద భద్రతాబలగాలు జాతీయ రహదారిని మూసివేసి తనిఖీలు చేస్తుండగా ఉగ్రవాదులు జవాన్లపై కాల్పులు జరిపారు. దీంతో కేంద్ర భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మరణించారు. 
 
ఎన్ కౌంటర్ అనంతరం కేంద్ర బలగాలతో గాలింపు తీవ్రం చేశారు. ఎన్‌కౌంట‌ర్ సందర్భంగా జ‌మ్ము-శ్రీన‌గ‌ర్ జాతీయ ర‌హ‌దారిని భ‌ద్ర‌తాద‌ళాలు మూసివేశాయి. న‌గ్రోటా చెక్‌పోస్ట్ ప్రాంతంలో భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేశారు. ఆప‌రేష‌న్ ఇంకా కొన‌సాగుతున్న‌ది. 
 
మరోవైపు పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన గ్రెనెడ్ దాడిలో 12 మంది పౌరులు గాయపడ్డారు. సీఆర్‌పీఎఫ్ జవాన్లు లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు గ్రెనెడ్ దాడి చేయగా అది తప్పి పౌరులు గాయపడ్డారు. దీంతో పుల్వామాలో భద్రతా దళాలు ఉగ్రవాదుల కోసం విస్తృతంగా గాలిస్తున్నాయి.
 
బాన్ టోల్‌ప్లాజాలో ఈ ఏడాది జ‌న‌వ‌రి 31న కూడా ఇదే విధంగా ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింద‌ని సీఆర్పీఎఫ్ అధికారులు తెలిపారు. టోల్ ప్లాజాలో ఉన్న పోలీసుల‌పై ఉగ్ర‌వాదులు కాల్పుల‌కు తెగ‌బ‌డ్డార‌ని, దీంతో ఒక పోలీసు గాయ‌ప‌డ్డాడ‌ని పేర్కొన్నారు. 
 
ఆ ఎన్‌కౌంట‌ర్‌లో ముగ్గురు ముష్క‌రుల‌ను అంత‌మొందించామ‌ని చెబుతూ స‌రిగ్గా అలాంటి ఘ‌ట‌నే ఇప్పుడు కూడా జ‌రిగింద‌ని సీఆర్పీఎఫ్ అధికారి శివ్‌నంద‌న్ సింగ్ వెల్ల‌డించారు.