ప్రత్యర్థులను హతమార్చే సిద్ధాంతాలకు తిరస్కరించండి 

కేరళలో కొనసాగుతున్న రాజకీయ హత్యలను తీవ్రంగా ఖండిస్తూ రాజకీయ ప్రత్యర్థులను హతమార్చడాన్ని ప్రోత్సహించే రాజకీయ సిద్ధాంతాలను తిరస్కరించవలసిందే అని కేరళ హై కోర్ట్ స్పష్టం చేసింది. 
 
మత్తూర్ షహాబ్ హత్యకేసులో సిపిఎం కార్యకర్తల బెయిల్ పిటిషన్ ను తిరస్కరిస్తూ ఈ వాఖ్యలు చేసింది. ఆధునిక నాగరికతలో అటువంటి సిద్ధాంతాలకు స్థానం లేదని కూడా హైకోర్టు తేల్చి చెప్పింది.
సిపిఎం కార్యకర్తలైన్ ఆకాష్ థిల్లాన్కేరి, టికే ఆస్కార్, కె అఖిల్, సీఎస్ దీప్ చాంద్ ల బెయిల్ పిటిషన్ లను తిరస్కరిస్తూ ఈ హత్యను ప్రణాళికాబద్ధంగా, వృత్తిపర బృందాలు సాగించాయని హైకోర్టు పేర్కొన్నది.
 
క్రూరమైన నేరంలో పాల్గొన్నవారికి బెయిల్ ఇవ్వడం సాధ్యంకాదని కూడా కోర్ట్ స్పష్టం చేసింది. కన్నూర్ జిల్లాలోని తెరూర్ లో ఒక టీస్టాల్ వద్ద టి త్రాగుతూ ఉండగా షహాబ్ ను 2018 ఫిబ్రవరి 12 అర్ధరాత్రి దారుణంగా హత్య చేశారు. 
 
ముందు బాంబులు వేసి, భయానక వాతావరణం సృష్టించి, తర్వాత పొడిచి చంపారు. తీవ్రంగా గాయపడిన అతనిని ఆసుపత్రికి తీసుకు వెళ్లే ప్రయత్నం చేసినవారిని సహితం అడ్డుకున్నారు. తర్వాత కోజ్హికోడే మెడికల్ హాస్పిటల్ లో మృతి చెందాడు.