రోజువారీ పనివేళలు 12 గంటలకు పెంపు   

రోజువారీ పనివేళలను 12 గంటలకు పెంచేందుకు అనుమతిస్తూ కేంద్ర కార్మిక శాఖ ముసాయిదా నిబంధనలను రూపొందించింది. ‘వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్‌’ (ఓఎస్‌హెచ్‌ కోడ్‌) కింద ఈ నిబంధనలను సిద్ధం చేసింది. వీటిపై సంబంధిత భాగస్వామ్య పక్షాలు 45 రోజుల్లోగా అభ్యంతరాలు, అభిప్రాయాలు తెలుపవచ్చని పేర్కొంది. వాటిని పరిశీలించిన అనంతరం ఓఎస్‌హెచ్‌ కోడ్‌ అమలుకు నిబంధనలను ఖరారు చేయనుంది. ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
తాజా ప్రతిపాదనల ప్రకారం రోజులో పనివేళలను గరిష్ఠంగా 12 గంటల వరకు పెంచుకోవచ్చు. అయితే ఇంతకుముందు ఉన్నమాదిరిగానే, వారంలో పనివేళలు గరిష్ఠంగా 48 గంటలు మించరాదు. అందుకనుగుణంగా, కార్మికుల పనిగంటలను ఒక రోజులో 12 గంటలకు (విశ్రాంతి వేళలను కలుపుకుని) మించకుండా సర్దుబాటు చేసుకోవాలని నిబంధనల్లో స్పష్టంచేశారు.
పార్లమెంట్‌ ఆమోదం తెలిపిన ఓఎస్‌హెచ్‌ కోడ్‌కు ఈ నిబంధనలు భిన్నంగా ఉండడం గమనార్హం. కోడ్‌లో రోజుకు గరిష్ఠ పనివేళలను ఎనిమిది గంటలుగా నిర్ణయించారు. 13 కేంద్ర కార్మిక చట్టాలను విలీనం చేసి ఆ కోడ్‌ను రూపొందించారు.  ఓఎస్‌హెచ్‌ కోడ్‌తోపాటు మిగిలిన మూడు కార్మిక కోడ్‌లకూ కేంద్రం ముసాయిదా నిబంధనలను రూపొందిస్తున్నది. జనవరి నాటికి వాటికి ఆమోదముద్ర వేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నది.
ప్రతి కార్మికుడికీ సదరు కంపెనీ తప్పకుండా నియామక పత్రం అందజేయాలని ముసాయిదా నిబంధనల్లో స్పష్టంచేశారు. హోదా (డిజిగ్నేషన్‌), నైపుణ్య క్యాటగిరీ, వేతనం తదితర వివరాలు అందులో ఉండాలని పేర్కొన్నారు. 45 ఏండ్లు పైబడిన కార్మికులకు యాజమాన్యం ఏటా ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్దేశించారు.
ఏడాదికి ఒకసారి ప్రయాణ భత్యం (ట్రావెల్‌ అలవెన్స్‌) ఇవ్వాలని స్పష్టంచేశారు. కాంట్రాక్ట్‌ కార్మికులను సరఫరా చేసే కాంట్రాక్ట్‌ కంపెనీ ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలల్లో ఐదేండ్లకు మించి కార్యకలాపాలు సాగిస్తుంటే, ఆ సంస్థకు అఖిల భారత లైసెన్స్‌ మంజూరుచేస్తారు. కాంట్రాక్ట్‌ కార్మికుల వేతనాలకు కాంట్రాక్టర్‌ వేతన గడువును (వేజ్‌ పీరియడ్‌) నిర్ణయించవచ్చు. ఇది నెలకు మించరాదు. బ్యాంక్‌ ట్రాన్స్‌ఫర్‌ లేదా ఎలక్ట్రానిక్‌ మాధ్యమంలోనే వేతనాలను చెల్లించాలి.
 
కాగా, అధిక పనిగంటలకు కార్మికులకు రెట్టింపు వేతనం చెల్లించాలని ముసాయిదా నిబంధనల్లో స్పష్టం చేశారు. ఒక రోజులో 8 గంటలకు మించి, వారంలో 48 గంటలకు మించి పనిచేసినట్లయితే, ఆ అధిక పని సమయానికి సాధారణ జీతానికి రెట్టింపు జీతం ఇవ్వాలని పేర్కొన్నారు. 
 
ఓవర్‌టైమ్‌ లెక్కింపుపైనా స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. ప్రస్తుతం ఓవర్‌టైమ్‌ 30 నిమిషాల కంటే తక్కువగా ఉంటే దానిని పరిగణనలోకి తీసుకోరు. ముసాయిదా నిబంధనల ప్రకారం.. 15-30 నిమిషాల మధ్య అధిక సమయం పనిచేస్తే దానిని 30 నిమిషాలుగా, 30 నిమిషాల నుంచి ఒక గంట మధ్య ఉంటే దానిని ఒక గంట ఓవర్‌టైమ్‌గా పరిగణిస్తారు.