బండి  సంజయ్ సవాల్ స్వీకరించని కేసీఆర్

వరద సాయం ఆపమంటూ తానేదో లేఖ వ్రాసానని ఆరోపణలు చేసిన కేసీఆర్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన సవాల్ కు స్పందించని లేదు.  వరద సాయం ఆపాలంటూ ఎన్నికల సంఘానికి బండి సంజరు లేఖ రాసినట్లు సిఎం కెసిఆర్‌ ఆరోపించారు.

దీనిపై స్పందించిన బండి సంజయ్‌.. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు పాతబస్తీలో చార్మినార్‌ దగ్గరలోని భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు వస్తానని, కెసిఆర్‌ కూడా రావాలని, అమ్మ వారిపై ప్రమాణం చేసి ఆ లేఖపై నిజాలు తేల్చుకుందామని గురువారం సవాల్‌ విసిరారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 

అయినా సంజయ్‌ భాగ్యలక్ష్మి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆయనతో పాటు పెద్ద సంఖ్యలో బిజెపి శ్రేణులు అక్కడి చేరుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను లేఖ రాస్తే వరద సాయం ఆపారని ప్రచారం చేశారని, సీఎం కేసీఆర్‌ స్వయంగా ఆరోపణలు చేయడం బాధాకరమని చెప్పారు. 

కెసిఆర్‌ ఆరోపణలపై తాను వెంటనే స్పందించానని, చెప్పిన సమయానికి ఇక్కడికి చేరుకున్నానని, అయితే ఆరోపణలు నిరూపించడానికి కెసిఆర్‌ రాలేదని ధ్వజమెత్తారు. ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో ఉన్నది తన సంతకం కాదని, ఎన్నికల జిమ్మిక్కులో భాగంగా నకిలీ లేఖలు సృష్టించి, తన సంతకం ఫోర్జరీ చేశారని మండిపడ్డారు. 

వరద సాయం అందక ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతోనే ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. సిఎంకు చిత్తశుద్ధి ఉంటే వరద సాయం అందించాకే ఎన్నికలకు వెళ్లాల్సిందని చెప్పారు. సర్వేలన్నీ బిజెపికి అనుకూలంగా ఉన్నాయనే ఇలాంటి తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. 

మజ్లీస్‌తో కుమ్మక్కై కెసిఆర్‌ బిజెపి మీద ఆరోపణలు చేస్తున్నారని, అబద్ధాల ముఖ్యమంత్రిని నమ్మొద్దని ప్రజలను కోరారు.  ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు బీజేపీని బూచిగా చూపుతున్నారని ఆరోపించారు. తన సవాల్‌ను స్వీకరించకుండా సీఎం కేసీఆర్‌ పారిపోయారని ఎద్దేవా చేశారు. దుబ్బాకలో సవాల్‌ చేసినా సీఎం కేసీఆర్‌ ముందుకు రాలేదని గుర్తు చేశారు. 

ఇక టీఆర్‌ఎస్‌ పని అయిపోయిందని కేసీఆర్‌కు అర్థమైందని స్పష్టం చేశారు. వరద సాయం రూ. 550 కోట్లలో సగం టీఆర్‌ఎస్‌ నేతలే మింగేశారని ఆరోపించారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే నేరుగా బాధితుల అకౌంట్లలోనే నగదు వేయొచ్చు కదా? అని ప్రశ్నించారు. 

కేసీఆర్‌ తన అబద్ధాలతో ప్రజల్ని మోసం చేస్తున్నారని విమర్శించారు. గ్రేటర్‌లో బీజేపీని గెలిపిస్తే వరద సాయం కింద రూ. 25 వేలు ఇస్తామని బండి సంజయ్‌ ప్రకటించారు.  తనకు మెడమీద తలకాయ ఉంది కాబట్టే ప్రజల సమస్యలపై మాట్లాడుతున్నానని చెలిపారు. 

హైదరాబాద్ విశ్వనగరం అని చెప్పి విషాద నగరంగా మారుస్తున్నారని విమర్శించారు. రిజిస్ట్రేషన్లు ఆపి పేద ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. డబుల్‌ బెడ్‌రూమ్‌లు, ఎల్‌ఆర్‌ఎస్‌పై కేసీఆర్‌ ఎందుకు మాట్లాడటంలేదని ఆయన ప్రశ్నించారు. 

సీఎం కేసీఆర్‌ మతం పేరుతో గెలిచే ప్రయత్నం చేస్తున్నారని చెబుతూ ఓ మతం ఓట్లతోనే గ్రేటర్‌లో గెలవాలనుకోవడం సిగ్గుచేటని దయ్యబట్టారు. కేంద్రంలో పేదల ప్రభుత్వం ఉందని, నిధులు తీసుకొస్తామని బండి సంజయ్‌ భరోసా ఇచ్చారు.  ఓ వర్గం ఓట్ల కోసం నీచమైన రాజకీయాలు చేయొద్దని హితవు చెప్పారు. సీఎం కేసీఆర్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి రాకపోయినా పరవాలేదని, ఫోన్‌లో అయినా తన సవాల్‌పై స్పందిస్తే చాలని బండి సంజయ్‌ సూచించారు.