జీహెచ్ఎంసీ లో  బీజేపీకి జన సైనికుల మద్దతు  

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని జనసైనికులకు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. నగరంలోని నాదెండ్ల మనోహర్ నివాసంలో బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, డాక్టర్ కె. లక్ష్మణ్‌తో భేటీ అయిన పవన్ జీహెచ్ఎంసీ ఎన్నికలపై చర్చించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ 2014లో బీజేపీతో కలిసి పని చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
 
హైదరాబాద్ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా, కార్యకర్తలకు ఇష్టం లేకపోయినా పోటీ నుంచి తప్పుకుంటున్నామని పేర్కొన్నారు. జనసైనికులు కాస్త నిరుత్సాహానికి గురైనా, ప్రస్తుత పరిస్థితుల్లో హైదరాబాద్ నగర రక్షణ కోసం బీజేపీకి మద్దతు ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు.
 
దుబ్బాక ఎన్నికల తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలపై చర్చిద్దామనుకున్నామని,  కానీ అంతలోనే ఎన్నికలు రావడం వల్ల అది కుదరలేదని తెలిపారు. ఈ సమయంలో ఓట్లు చీలకూడదని ఈ నిర్ణయం తీసుకున్నామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.నగరంలో బలమైన వ్యవస్థ ఉండాలని, బీజేపీ గెలవాలన్న ముఖ్య ఉద్దేశంతో ఎన్నికల బరిలో నిలుచోలేదని వెల్లడించారు. నిరుత్సాహపడొద్దని జనసైనికులకు విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తు అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా రోడ్ మ్యాప్ రూపొందించుకుంటామని తెలిపారు.

తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి తెలిపారు. దీనికి తాజా దుబ్బాక ఉపఎన్నికే నిదర్శనమని చెప్పారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జనసేన తమకు మద్దతివ్వడం పట్ల సంతోషం ప్రకటించారు. ఈ ఎన్నికల్లో బీజేపీతో కలిసి రావాలని జనసేనను కోరామని, బీజేపీ విజయానికి పూర్తిగా సహకరిస్తామని పవన్‌ కల్యాణ్‌ చెప్పారని పేర్కొన్నారు. 

కేవలం ఈ ఎన్నికల్లోనే కాకుండా భవిష్యత్తులోనూ కలిసి పని చేస్తామని లక్ష్మణ్‌ తెలిపారు. హడావుడి నోటిఫికేషన్ తో పూర్తి స్థాయిలో చర్చించుకోలేక పోయామని, అయినా జనసేన పూర్తి స్థాయిలో బీజేపీకి మద్దతు తెలిపేందుకు అంగీకరించిందని చెప్పారు. బీజేపీకి జనసేన తోడుంటే ప్రజల కలలు నెరవేరుతాయన్నాని విశ్వాసం వ్యక్తం చేశారు.