పాక్ యుద్ధ విమానాల ఆధునీకరణకు ఫ్రాన్స్ తిరస్కారం 

పాతబడిన మిరేజ్ యుద్ద విమానాలు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, అగొస్టా 90బి క్లాస్ జలాంతర్గాములను ఆధునికీకరించాలని పాకిస్థాన్ చేసిన విజ్ఞప్తిని ఫ్రాన్స్ తోసిపుచ్చినట్లు  తెలుస్తున్నది. ఇంతకు ముందు జర్మనీ కూడా ఇటువంటి విజ్ఞప్తిని తిరస్కరించింది. 
ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌  దైవ దూషణ పేరుతో వ్యక్తులను హత్య చేయడాన్ని సమర్థించినందుకు ఫ్రాన్స్ ఈ విధంగా చేస్తున్నట్లు చెబుతున్నప్పటికీ ఆ దేశానికి భారత్ తో గల వ్యూహాత్మక సంబంధాలే కారణంగా తెలుస్తున్నది.
పాకిస్థాన్ వద్ద దాదాపు 150 మిరేజ్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి. వీటిని ఫ్రెంచ్ కంపెనీ డసాల్ట్ ఏవియేషన్ తయారు చేసింది. వీటిలో దాదాపు సగం మాత్రమే సర్వీస్ చేయదగిన స్థితిలో ఉన్నాయి. కాబట్టి వీటిని అప్‌గ్రేడ్ చేయడానికి ఫ్రాన్స్ తిరస్కరించడంతో పాకిస్థాన్‌పై తీవ్ర ప్రభావం పడుతుంది.
ఫ్రెంచ్-ఇటాలియన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను, అగొస్టా 90బీ జలాంతర్గాములను ఆధునికీకరించాలన్న విజ్ఞప్తి కూడా తిరస్కరణకు గురైంది.  పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్, టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ సన్నిహితంగా ,మెలగడం కూడా అందుకు ఒక కారణంగా కనిపిస్తున్నది.
ఇటీవల పారిస్‌లో ఓ స్కూల్ టీచర్ తన విద్యార్థులకు ప్రవక్త మహమ్మద్ క్యారికేచర్‌ను చూపించారు. ఆ టీచర్‌ను ఓ వ్యక్తి హత్య చేశాడు. దీనిపై ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఎమ్మాన్యుయెల్ మేక్రన్ స్పందిస్తూ, మతాన్ని విమర్శించే హక్కు ఉందని స్పష్టం చేశారు. దీనిపై  పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ముస్లిం దేశాల నేతలకు ఓ లేఖ రాశారు.
ఆ లేఖలో మేక్రన్‌పై ఘాటైన విమర్శలు గుప్పించారు. పెరుగుతున్న ఇస్లామోఫోబియాకు వ్యతిరేకంగా ఏకం కావాలని పిలుపునిచ్చారు. అక్కడితో ఆగకుండా పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీ మరో అడుగు ముందుకు వేసింది. పారిస్‌లోని పాకిస్థాన్ దౌత్యవేత్తను వెనుకకు రప్పించాలని తీర్మానం చేసింది.
అయితే మూడు నెలల నుంచి పారిస్‌లో పాకిస్థాన్ దౌత్యవేత్త లేరన్న విషయాన్ని ఆ తర్వాత గుర్తించింది. ఈ అంశాలతోపాటు భారత దేశంతో ఫ్రాన్స్‌కుగల వ్యూహాత్మక సత్సంబంధాలు పాకిస్థాన్‌‌ ఆశలపై నీళ్లు జల్లాయి. మేక్రన్‌పై వ్యక్తిగత విమర్శలను భారత ప్రభుత్వం ఖండించింది.
భారత దేశ విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్థన్ శృంగ్లా అక్టోబరు 29న ఫ్రాన్స్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఫ్రాన్స్ మన దేశానికి గట్టి భరోసా ఇచ్చింది. తన వ్యూహాత్మక మిత్ర దేశపు భద్రతాపరమైన అంశాల పట్ల తాము సున్నితంగా వ్యవహరిస్తామని ఫ్రాన్స్ హామీ ఇచ్చింది.
భారతీయ వాయు సేనలో రఫేల్ యుద్ధ విమానాలను ప్రవేశపెట్టిన నేపథ్యంలో రఫేల్ యుద్ధ విమానాల నుంచి పాకిస్థానీ టెక్నీషియన్లను దూరంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. రఫేల్ యుద్ధ విమానాలను ఖతార్ కూడా కొనుగోలు చేసింది. ఈ యుద్ధ విమానాలలో పని చేసేందుకు పాకిస్థానీ టెక్నీషియన్లకు అవకాశం ఇవ్వకూడదని ఖతార్‌కు ఫ్రాన్స్ ప్రభుత్వం చెప్పింది.