యరపతినేని నివాసాల్లో సీబీఐ సోదాలు

మాజీ ఎమ్మెల్యే, టిడిపి నేత  యరపతినేని శ్రీనివాసరావు నివాసాల్లో సిబీఐ గురువారం సోదాలు జరిపింది.  తెలంగాణలోని హైదరాబాద్‌తో పాటు గుంటూరు జిల్లా గురజాల, పిడుగురాళ్ల, నడికుడి, నారాయణపురం, కేసానుపల్లి తదితర 25 ప్రాంతాల్లోని నిందితుల నివాసాలు, కార్యాలయాల్లో సీబీఐ సోదాలు జరిపింది. 
 
దీనికి సంబంధించిన వివరాలను సీబీఐ ఢిల్లీ ప్రధాన కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. తాము జరిపిన సోదాల్లో అనేక ఆధారాలతో పాటు  పలు కీలక పత్రాలు, మొబైల్‌ ఫోన్లు, సామగ్రి, నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది.     
 
అక్రమ మైనింగ్‌కు సంబంధించిన 17 కేసులను సీబీఐకు సీఐడీ బదిలీ చేసింది. అగష్టు 26వ తేదీన సీబీఐ కేసు నమోదు చేసింది. 2014 నుంచి 2018 పల్నాడు ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరిగిందని ఆరోపణలు వచ్చాయి. గుంటూరు జిల్లాలోని అక్రమ మైనింగ్ జరిగాయని ఆభియోగాలు వచ్చాయి. 
 
2014 నుంచి 2018 వరకు అనేక లక్షల టన్నుల సున్నపురాయిని అక్రమంగా తవ్వేశారని, మొత్తంగా అనేక కోట్ల రూపాయల మేర విలువైన సహజ వనరులు దోచుకున్నారనే ఆరోపణలపై దర్యాపు చేస్తున్నట్లు సీబీఐ పేర్కొంది.
 
అక్రమ మైనింగ్‌ కేసు దర్యాప్తు చేపట్టిన సీబీఐ.. నష్టం అంచనా వేయడానికి దేశంలోనే తొలిసారిగా సిబిఐ శాటిలైట్‌ చిత్రాలను ఉపయోగించుకుంటోంది. అక్రమ మైనింగ్‌కు ముందు, ఆ తర్వాత.. శాటిలైట్‌ చిత్రాలను తీసుకొని వాటిని సాంకేతిక పద్ధతుల్లో పరిశీలించి ఏ మేరకు అక్రమ మైనింగ్‌ చేశారనే దానిని సీబీఐ అంచనా వేస్తోంది.