తుంగభద్ర పుష్కరాల ప్రారంభం నేడే 

తుంగభద్ర పుష్కరాల కోసం కర్నూలు జిల్లా ముస్తాబైంది. పుష్కరాలను విజయవంతం చేయడానికి జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. తుంగభద్ర పుష్కరాలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. మొదటి రోజున ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పాల్గొంటున్నారు.
సంకల్‌బాగ్‌ ఘాట్‌ వద్ద మధ్యాహ్నం వైఎస్‌ జగన్‌ ఈ పుష్కరాలను ప్రారంభిస్తారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కరోనా మార్గదర్శకాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. కట్టుదిట్టమైన భధ్రతా ఏర్పాట్లను చేపట్టారు.
తుంగభద్ర పుష్కరాలను పురస్కరించుకుని కర్నూలు నగరాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ప్రధాన మార్గాల్లో విద్యుద్దీపాలు ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టరేట్‌, ఎస్‌పి కార్యాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ విద్యుత్‌ కాంతులతో మెరిసిపోతున్నాయి.
పవిత్ర స్నానాలను ఆచరించడానికి వచ్చే యాత్రికులు గందరగోళానికి గురి కాకుండా ఉండేలా బ్యానర్లను అమర్చారు. ఏ ఘాట్‌కు ఎటు వెళ్లాలనే విషయాలను ముద్రించిన బ్యానర్లు, బోర్డులను అమర్చారు.
కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్నందు వల్ల నదిలో స్నానం చేయడాన్ని నిషేధిం పుష్కర స్నానాన్ని ఆచరించడానికి వచ్చే వారి కోసం ఘాట్ల వద్ద స్ప్రింకర్లను ఏర్పాటు చేశారు. వాటి కిందే స్నానం చేయాల్సి ఉంటుంది. ఎక్కువ మంది గుమికూడటంపైనా నిషేధం ఉంది.
భౌతికదూరాన్ని పాటించేలా ముందుజాగ్రత్త చర్యలను తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు హెచ్చరించారు. మాస్కులను ధరించడం తప్పనిసరి చేశారు. జ్వరం, దగ్గు, శ్వాసకోశ సంబంధింత ఇబ్బందులు ఉన్నవారు పుష్కరాలకు రావొద్దని విజప్తి చేశారు.
తుంగభద్ర నదీ పరీవాహక ప్రాంతం పొడవునా 23 పుష్కర ఘాట్లను ఏర్పాటు చేశారు. కర్నూలు సిటీ పరిధిలో.. మాసా మసీద్‌ (పంప్‌ హౌస్‌), సంకల్‌బాగ్‌, నాగసాయి ఆలయం, రాంభొట్ల ఆలయం, రాఘవేంద్ర మఠం, సాయిబాబా ఆలయం, నగరేశ్వర స్వామి ఆలయాల వద్ద పుష్కర ఘాట్లను నిర్మించారు.
కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో.. గుండ్రేవుల, సుంకేశుల, పంచలింగాల, మునగాలపాడు, గొందిపర్ల వద్ద ఘాట్లు అందుబాటులో ఉన్నాయి. మంత్రాలయం పరిధిలో.. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం సమీపంలో రెండు పుష్కర ఘాట్లను నిర్మించారు.
ఎన్‌ఎపి పంప్‌ హౌస్‌, సంత మార్కెట్‌, వినాయక ఆలయం వద్ద ఘాట్లు అందుబాటులో తెచ్చారు. రాంపురం, మైలిగన్నూర్‌, కౌతాళం, కాచపురాల్లో ఘాట్లు నిర్మించారు. ఎమ్మిగనూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో.. నాగులదిన్నె రైల్వే బ్రిడ్జి, నాగులదిన్నె విలేజ్‌, గురుజాలల్లో ఘాట్లు ఉన్నాయి.
నందికొట్కూర్‌ నియోజకవర్గం పరిధిలో.. కొత్తపల్లి – సంగమేశ్వరం వద్ద ఘాట్‌ను నిర్మించారు. ఇదే చివరి ఘాట్‌. అన్ని ఘాట్ల వద్దకు యాత్రికులను తరలించడానికి ప్రత్యేకంగా ఆర్‌టిసి బస్సులను నడిపించనున్నారు.