అమరావతి మహిళలకు పవన్ కళ్యాణ్ భరోసా 

అమరావతి మహిళలకు పవన్ కళ్యాణ్ భరోసా 
‘అమరావతి ఉద్యమం మహిళలే ముందుండి నడిపిస్తున్నారు. నేను మీ వెనుకే… మీ వెంటే ఉంటాను. అండగా నిలుస్తాను. అమరావతి ఉద్యమానికి మా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది. ఎప్పుడు అవసరమైనా… జనసేన మీతో కలిసి నడుస్తుంది’ అంటూ అమరావతి మహిళలు, రైతులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. 
 
 భూములు ఇచ్చిన తాముమానసిక క్షోభ అనుభవిస్తున్నామని మహిళలు తనను కలిసి కన్నీరు పర్యంతం కావడంతో వారిని సముదాయిస్తూ తనకు ఓట్లు వేయకపోయినా తాను ధర్మం వైపు నడుస్తాను అంటూ వారికి హామీ ఇచ్చారు. అమరావతి రైతులను మానసిక క్షోభకు గురిచేయడం భావ్యం కాదని వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఆయన హితవు చెప్పారు. 
 
 ‘ఎప్పుడూ బయటకు రాని ఆడవాళ్లు రోడ్లపైకి వచ్చారు. లాఠీఛార్జ్‌లు, బేడీలను భరిస్తూ ఉద్యమం చేస్తున్నారు. దళితుల పైనే ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టే స్థాయికి‌ వైసీపీ ప్రభుత్వం దిగజారింది; అంటూ పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. 
 
ఎంతోమంది మహిళలు తమ పుట్టింటి కానుకగా భూములు తెచ్చుకుని ఉంటారు. అటువంటి పొలాలను కూడా రాజధాని‌ కోసం త్యాగం చేశారని చెబుతూ ఏ ప్రభుత్వం మారినా గత ప్రభుత్వాల విధానాలను అమలు‌ చేయాలని స్పష్టం చేశారు. 2014లో జగన్ అమరావతికి అంగీకారం తెలిపారని గుర్తు చేస్తూ అప్పుడు వ్యతిరేకంగా ఉంటే వీరు‌ భూములు ఇచ్చే వారు కాదని చెప్పారు. 
 
తాను రైతు పక్షపాతిని అని, తనకు రైతుల కష్టం, భూమి విలువ తెలుసని చెబుతూ గతంలో ఎస్ఇజెడ్‌ల పేరుతో గతంలో కూడా రైతుల భూములను లాక్కున్నారని పేర్కొన్నారు. 29వేల మంది రైతులు భూములు ఇస్తే.. ఇప్పుడు కులాలు, రాజకీయాలు అంటగడుతున్నారని విస్మయం వ్యక్తం చేశారు. 
 
“మీ భూములు మీకు ఇవ్వడానికి అవి ఎక్కడ ఉన్నాయో కూడా చెప్పలేని స్థితిలో రోడ్లు‌ వేశారు. గుంటలు తవ్వారు.. ఈ పరిస్థితిలో ప్రభుత్వం ఎలా మారుస్తుంది. ఆనాడు కులం, పార్టీ లేని జగన్‌కు ఇప్పుడు అవే కనిపిస్తున్నాయా?’ అని ప్రశ్నించారు. 
 
రాజధాని ఇక్కడే ఉంటుందని తాను బలంగా నమ్ముతున్నానని చెబుతూ పోలీసులు కూడా ఆలోచించాలని కోరారు. పొలిటికల్ బాస్‌లు చెప్పినట్లు చేయవద్దని హితవు చెప్పారు. ప్రజలు రోడ్లపైకి వస్తే ఏం జరుగుతుందో పోలీసులు కూడా ఆలోచించాలని హెచ్చరించారు. దళితులపై పెట్టిన ఎస్సీ, ఎస్టీ కేసులు పూర్తిగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 
 
బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకున్న సమయంలోనే అమరావతి రాజధానిగా నిర్ణయించామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. అమరావతి విషయంలో బిజెపి నేతలు కూడా స్పష్టంగా ఉన్నారని చెబుతూ వ్యవస్థలలో ఉన్న ఇబ్బందులు వల్ల.. కేంద్రం అన్ని అంశాలలో జోక్యం చేసుకోదని చెప్పారు. 
 
బీజేపీ రాష్ట్ర పార్టీ నిర్ణయానికి కేంద్ర నాయకత్వం కట్టుబడి ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. “మీకు చెప్పే విధానం నచ్చకపోయినా…‌ అమరావతి ఇక్కడే అనేది నిజం. ఇందులో ఎటువంటి తేడా జరిగినా…‌మీకు అండగా నేను పోరాడతా” అంటూ పవన్‌కల్యాణ్ రైతులకు భరోసా ఇచ్చారు.