ఉగ్రవాదంపై ఉమ్మడి పోరుకు ప్రధాని మోదీ పిలుపు 

ఉగ్రవాదంపై బ్రిక్స్‌దేశాలన్నీ ఉమ్మడి పోరాటం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ  పిలుపునిచ్చారు. రష్యా అధ్యక్షుడు వ్లాదమిర్‌ పుతిన్‌అధ్యక్షతన ప్రారంభమైన  12వ బ్రిక్స్ స‌ద‌స్సులో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ప్ర‌ధాని ప్రసంగిస్తూ  ప‌్ర‌స్తుతం ప్ర‌పంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద స‌మ‌స్య ఉగ్ర‌వాద‌మేన‌ని స్పష్టం చేశారు. 

పాకిస్థాన్‌ను పరోక్షంగా ప్రస్తావిస్తూ,  ముందుగా ఉగ్ర‌వాదుల‌ను పెంచి పోషిస్తున్న దేశాల‌ను అదుపుచేస్తే స‌మ‌స్య సంస్థాగ‌తంగా ప‌రిష్కార‌మ‌వుతుంద‌ని  చెబుతూ ఉగ్రవాదులకు మద్దతిచ్చే దేశాలపై చర్యలు తీసుకోవాలని, వాటిని దోషులుగా నిలబెట్టాలని కోరారు. ఉగ్రవాదానికి మద్దతిచ్చే, నిధులు సమకూర్చే అన్ని దేశాలను జవాబుదారీ చేయాలన్నారు. మోదీ వ్యాఖ్యలను రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ సమర్థించారు. 

ఐరాసలో తక్షణ సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని  ప్రధాని స్పష్టం చేశారు. ఐరాస భద్రతా మండలితో పాటు ఐఎంఎఫ్‌, డబ్ల్యూటివో, డబ్ల్యూహెచ్‌వో వంటి సంస్థలను సంస్కరించాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పారు. ఇప్పటికీ ఈ సంస్థలు 75 ఏళ్ల నాటి మూస విధానాన్నే అవలంభిస్తున్నాయని విమర్శించారు. ఈ మార్పుకు బ్రిక్స్‌ దేశాల మద్దతును కోరారు. 

2021లో బ్రిక్స్ ఏర్పాటై 15 ఏండ్లు పూర్త‌వుతుంద‌ని, అప్ప‌టిక‌ల్లా గ‌త స‌ద‌స్సుల్లో తీసుకున్న నిర్ణ‌యాలు, వాటి అమలుకు సంబంధించిన వివ‌రాల‌తో నివేదిక రూపొందిస్తార‌ని ఆయ‌న తెలిపారు. 

తాము త‌మ దేశంలో ఆత్మ నిర్బ‌ర్ భార‌త్ కార్య‌క్ర‌మం పేరుతో ఒక స‌మ‌గ్ర‌మైన సంస్క‌ర‌ణ ప్ర‌క్రియ‌ను చేప‌ట్టామ‌ని, కొవిడ్ అనంత‌రం దేశాన్ని అన్ని విధాలుగా బ‌లోపేతం చేయాల‌నే ల‌క్ష్యంతో తాము ఈ కార్య‌క్ర‌మం చేప‌ట్టామ‌ని ప్ర‌ధాని మోదీ పేర్కొన్నారు. 

కరోనా కాలంలో 150కిపైగా దేశాలకు భారత్‌ ఔషధాలను అందించిందని గుర్తు చేశారు.  అది భార‌త దేశ‌పు ఫార్మా ప‌రిశ్ర‌మ స‌మ‌ర్థ‌త‌ను చాటి చెప్పింద‌ని తెలిపారు. అదే మాన‌వ‌తా దృక్ప‌థంతో ఇప్పుడు క‌రోనా వ్యాక్సిన్ ఉత్ప‌త్తి, స‌ర‌ఫ‌రా కొన‌సాగుతుంద‌ని చెప్పారు.     

అవసరమైతే సరైన సమయంలో వ్యాక్సిన్‌ను కూడా సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. సదస్సులో సభ్యదేశాలైన బ్రెజిల్‌, చైనా, దక్షిణాఫ్రికా అధినేతలు పాల్గొని ప్రసంగించారు.