చర్చా వేదికగా మారిన దుర్భల విభాగం భద్రతా మండలి 

చర్చా వేదికగా మారిన దుర్భల విభాగం భద్రతా మండలి 

విశ్వవిద్యాలయాలలో జరిగే చర్చల వేదికగా మిగిలిపోయిన దుర్భల విభాగంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని భారత్ అభివర్ణించింది.  ‘‘నేటి భద్రతా మండలి దుర్బల విభాగం. ప్రాతినిథ్యం లేని స్వభావం కారణంగా ఇది విశ్వసనీయంగా పని చేయలేకపోతోంది.  ఐజీఎన్ ప్రాసెస్‌లో ఏం జరుగుతోంది?’’ అంటూ భారత్ ప్రశ్నించింది. 

 కొన్ని దేశాలు ఇంటర్ గవర్నమెంటల్ నెగొషియేషన్స్ (ఐజీఎన్)ను పొగ తెరగా వాడుకుంటున్నాయని విమర్శించింది. బలహీనపడిన భద్రతా మండలి సంస్కరణలను ఆ దేశాలు ఆపుతున్నాయని ఆరోపించింది. చాలా కాలం నుంచి జాప్యం జరుగుతున్న సంస్కరణల కోసం నిశ్చయాత్మక కదలికకు ఇదే సరైన సమయమని స్పష్టం చేసింది . 

ఐక్య రాజ్య సమితికి భారత దేశ శాశ్వత ప్రతినిథి, అంబాసిడర్ టీఎస్ తిరుమూర్తి భద్రతా మండలిలో మాట్లాడుతూ, సంస్కరణల అవసరంపై ఆసక్తికర ప్రకటనలు తప్ప ఇంటర్ గవర్నమెంటల్ నెగొషియేషన్స్ విషయంలో దశాబ్దంపైగా ఎటువంటి కదలిక లేదని ధ్వజమెత్తారు. 

‘సార్వభౌమాధికారంగల సభ్య దేశాలతో కూడిన ఐక్య రాజ్య సమితిలో సత్ఫలితాలు ఇవ్వగలిగే ప్రక్రియ జరగడం లేదని విచారం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితికి కారణం మనం పురోగతి సాధించడానికి కొన్ని దేశాలు ఇష్టపడకపోవడమేనని దుయ్యబట్టారు. 

ఐజీఎన్ ముందుకెళ్లకుండా ఆ దేశాలు అడ్డుకుంటున్నాయని పేర్కొంటూ భద్రతా మండలి సంస్కరణల కోసం నామమాత్రంగా మాట్లాడుతూ, తమను ఇతరులు గుర్తించకుండా ఐజీఎన్‌ను పొగ తెరగా వాడుకుంటున్నాయని విమర్శించారు.  ఆ దేశాలు విధిస్తున్న షరతులను నెరవేర్చడం అసాధ్యమని తిరుమూర్తి స్పష్టం చేశారు. 

సభ్య దేశాలన్నీ సంపూర్ణ సమ్మతి తెలపాలనే షరతును నెరవేర్చడం అసాధ్యమని పేర్కొంటూ మనకు మనం ఈ-ఓటింగ్ హక్కులను కల్పించుకోవడం కోసం గత వారం ఆత్రుత ప్రదర్శించిన సమయంలో ఇదంతా జరుగుతోందని విస్మయం వ్యక్తం చేశారు.

అయితే ఐజీఎన్ కోసం ఆ దేశాలకు ఓటింగ్ అక్కర్లేదని, ఈ-ఓటింగ్ మాటకేం కానీ సంపూర్ణ సమ్మతి మాత్రమే కోరుకుంటున్నాయని ఆయన చెప్పారు. నిశ్చయాత్మక కదలిక లేకపోతే, వాస్తవ సంస్కరణలకు మద్దతిచ్చేవారు, మన నేతలు చేసిన వాగ్దానాల అమలును కోరుకునేవారు ఫలితాల కోసం ఐజీఎన్‌కు అతీతంగా చూడవలసిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడుతుందని తిరుమూర్తి పేర్కొన్నారు.

అదే జరిగితే మనం ఐజీఎన్ పక్రియను పునఃసమీక్షించుకోవడానికి సందేహించకూడదని పిలుపిచ్చారు. చిన్న, మధ్య తరహా దేశాల పట్ల మొసలి కన్నీరు కార్చే దేశాలు కనీస మర్యాదను కూడా నిరాకరిస్తున్నాయని మండిపడ్డారు. చర్చల అధికారిక రికార్డులను భద్రపరచుకోవడానికి ఉపయోగపడే కనీస మర్యాదను కూడా ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు.

ఇక్కడ ఏం జరుగుతున్నదో తెలిపే రికార్డులు ఉండటం లేదని, తదుపరి సంవత్సరాన్ని అంతకుముందు ఏమీ జరగలేదన్నట్లుగానే ప్రారంభిస్తున్నామని ఎద్దేవా చేశారు.

2021 జనవరి 1 నుంచి భారత దేశం ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలో నాన్ పర్మనెంట్ మెంబర్‌గా చేరుతుంది. ఈ సభ్యత్వం రెండేళ్ళపాటు ఉంటుంది.