అవినీతిపరులకు జీవితకాల శిక్ష విధించండి 

అవినీతి, నల్లధనం, బినామీ, ఆదాయానికి మించిన ఆస్తులు, మనీలాండరింగ్‌, పన్ను ఎగవేతల్లాంటి కేసుల్లో దోషులకు జీవితకాల శిక్షలు విధించాలని కోరుతూ బిజెపి నేత, న్యాయవాది అశ్వినీ కుమార్‌ ఉపాధ్యాయ సుప్రీంకోర్టులో మరో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు.
 
అమెరికా సహా పలు దేశాల్లో తీవ్ర ఆర్థిక నేరాలకు పాల్పడిన 97 మందికి గత రెండు దశాబ్దాల్లో 100 నుంచి వేల సంవత్సరాల జైలు శిక్షలు విధించిన ఉదంతాలను ఆయన కోర్టు దృష్టికి ఈ సందర్భంగా  తీసుకొచ్చారు.
 
ప్రస్తుతం భారతదేశంలోని అవినీతి నిరోధక చట్టాలు బలహీనంగా ఉన్నాయని, వాటి ప్రకారం గరిష్ఠంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించడం తప్ప అవినీతి ద్వారా సంపాదించిన ఆస్తులను 100 శాతం స్వాధీనం చేసుకునే అవకాశం లేదని అశ్వినీ కుమార్ గుర్తు చేశారు.  
 
అందువల్ల ప్రపంచంలోనే అత్యుత్తమమైన అవినీతి నిరోధక చట్టాలను రూపొందించేలా న్యాయ కమిషన్‌, లోక్‌పాల్‌లను ఆదేశించాలని సుప్రీంకోర్టును అర్థించారు.  నల్లధనం వెలికితీత కోసం కేంద్రం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ ఛైర్మన్‌గా సేవలందించిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ అరిజిత్‌ పసాయత్‌ కూడా మనీలాండరింగ్‌ కేసుల్లో నిందితులకు జైలుశిక్ష పెంచాలని చెప్పినట్లు గుర్తు చేశారు. 
 
ప్రస్తుతం భారతదేశంలో రూపాయి నుంచి రూ.300 కోట్ల వరకు మనీలాండరింగ్‌ చేసేవారికి ఒకే రకమైన శిక్ష ఉంది. ఆర్థిక నేరాలూ.. హత్య, హత్యాయత్నం లాంటి తీవ్రమైన నేరాలే అయినా మన దేశంలో వాటిని ఆ కేటగిరీలో చేర్చలేదు’ అని జస్టిస్‌ పసాయత్‌ పేర్కొన్నట్లు ప్రస్తావించారు.
 
దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు అన్నీ కలిపి రూ.70 లక్షల కోట్ల బడ్జెట్‌ను ఖర్చు చేస్తున్నాయని, అందులో 10 శాతం  (సుమారు రూ.7 లక్షల కోట్లు) నల్లధనంగా మారుతోందని ఆయన అంచనా వేశారు. అందువల్ల కేంద్రం రూ.100 కంటే పెద్ద నోట్లను ఉపసంహరించి నగదు లావాదేవీలను గరిష్ఠంగా రూ.5వేలకు పరిమితం చేసేలా చూడాలని కోరారు. 
 
రూ.50వేలకు మించిన ఆస్తులన్నింటినీ ఆధార్‌తో అనుసంధానించి బినామీ, ఆదాయానికి మించిన ఆస్తులన్నింటినీ నూరుశాతం స్వాధీనం చేసుకునేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.
 
దేశంలో అవినీతి కనుమరుగైతే కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలకు 20 శాతం అదనపు ఆదాయం వస్తుందని, వినియోగ వస్తువుల ధరలు 20 శాతం  తగ్గుతాయిని, పారదర్శక ఆర్థిక వ్యవస్థ ఏర్పడుతుందాని పేర్కొన్నారు.   పైగా,  అయిదు శాతం వడ్డీకే బ్యాంకు రుణాలు లభిస్తాయని, మౌలిక వసతుల నిర్మాణ వ్యయం 10 శాతం తగ్గుతుందని, వ్రవాదం, ఉగ్రవాదం, వేర్పాటువాదం 50 శాతం తగ్గిపోతాయని వివరించారు. 
 
వీటితో పాటు మతం, భాష, ప్రాంతీయ వాదాలు 50 శాతం కనుమరుగవుతాయని,   ఈడబ్ల్యూఎస్‌-బీపీఎల్‌ కుటుంబాలకు 20శాతం అదనంగా సబ్సిడీలు ఇవ్వొచ్చని,  దేశవ్యాప్తంగా ప్రపంచ స్థాయి మౌలిక వసతుల కల్పన సాధ్యమవుతుందని, జీడీపీలో 20 శాతం వృద్ధి సాధ్యమవుతుందని, ఉద్యోగాలు భారీగా పెరుగుతాయని, మరింత మంది ప్రజలకు సామాజిక భద్రత కల్పన సాధ్యమవుతుందని తెలిపారు. 
 
పైగా, పన్ను ఎగవేతల నుంచి నవ కల్పనల వైపు దృష్టి మరలుతుందని,  అంతర్జాతీయ పోటీని తట్టుకుని నిలిచే వ్యాపార వ్యవస్థ ఏర్పడుతుందని, ఉత్తమమైన న్యాయపాలన సాధ్యమవుతుందని కూడా ఆశాభావం వ్యక్తం చేశారు.  ప్రాథమిక హక్కులకు మరింత భద్రత ఏర్పడుతుంది అని అశ్వినీకుమార్‌ ఉపాధ్యాయ కోర్టు దృష్టికి తెచ్చారు. 
 
లంచం, నల్లధనం, బినామీ ఆస్తులు, ఆదాయానికి మించిన ఆస్తులు, పన్ను ఎగవేతలు, మనీలాండరింగ్‌, అధిక లాభాలు పొందడం, ఆహార ధాన్యాల అక్రమ నిల్వ, ఆహార కల్తీ, మనుషులు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, బ్లాక్‌ మార్కెటింగ్‌, మోసం, ఫోర్జరీ, మోసపూరితంగా ఆస్తుల దుర్వినియోగం, విశ్వాస ఘాతుకం, ఖాతాలు రాయడంలో మోసాలు, బినామీ లావాదేవీలు, కార్పొరేట్‌, ఫోరెన్సిక్‌ మోసాలన్నింటికీ జీవితకాల జైలు శిక్ష విధించాలని ఉపాధ్యాయ తన పిటిషన్‌లో సుప్రీంకోర్టును కోరారు. 
 
‘ప్రతి చోటా అవినీతి చొరబడటం వల్లే దేశంలో ఎక్కువగా దీని గురించే చర్చ జరుగుతోంది. అది ప్రపంచవ్యాప్తంగా ప్రజల రోజువారీ జీవితంలోని అన్ని కోణాలతోనూ పెనవేసుకు పోయింది’ అని ఆంధ్రప్రదేశ్‌ వర్సెస్‌ వాసుదేవరావు కేసులో 2014లో సుప్రీం ఇచ్చిన తీర్పులోని అంశాన్ని ఆయన ఈ సందర్భంగా కోర్టు దృష్టికి తెచ్చారు.