ఒకేసారి శీతాకాల, బడ్జెట్ పార్లమెంట్ సమావేశాలు 

ఈసారి పార్లమెంట్ శీతాకాల, బడ్జెట్ సమావేశాలను కలిపి నిర్వహించే అవకాశం ఉంది. కోవిడ్ 19 ప్రభావంతో ప్రత్యేకించి దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్ కేసులు పెరుగుతూ ఉండటంతో అసాధారణ రీతిలో నవంబర్ – డిసెంబర్ లలో శీతాకాల సమావేశాలు జరిపే అవకాశాలు కనిపించడం లేదు. అయితే దీనికి సంబంధించి అధికారికంగా నిర్ణయం తీసుకోవలసి ఉంది. 

సాధారణంగా శీతాకాల సమావేశాల తరువాత బడ్జెట్ సెషన్ జరుగుతుంది. అయితే శీతాకాలంలో కరోనా వైరస్ వ్యాప్తి మరింతగా ఉంటుందనే హెచ్చరికలు వెలువడటం, వెంట వెంటనే వేర్వేరుగా రెండు సెషన్లు నిర్వహించడం కన్నా రెండింటిని కలిపి ఒకే దఫా సెషన్ నిర్వహించే ఆలోచనలు జరుగుతున్నట్లు తెలిసింది. 

ఈ మేరకు తగు విధంగా షెడ్యూల్ ఖరారు చేసుకోవడం మంచిదని సలహాలు అందుతున్నాయనే కారణంతో అధికార యంత్రాంగం ఇందుకు అనుగుణంగానే స్పందించేందుకు వీలుంది. ప్రతి సారి శీతాకాల పార్లమెంట్ నవంబర్ చివరి వారంలోలేదా డిసెంబర్ తొలివారంలో మొదలవుతుంది. ఇక బడ్జెట్ సెషన్ మారిన పద్థతుల మేరకు జనవరి చివరి వారం ఆరంభం అవుతుంది. 

కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్‌కు సమర్పిస్తారు. ఇప్పుడున్న కోవిడ్ భయాలు , పలువురు ఎంపిలకు కరోనా సోకిన సందర్భాలు, ఢిల్లీలో వాయుకాలుష్య తీవ్రత నేపథ్యంలో వెంట వెంటనే వింటర్ ఆ తరువాత లెక్కల పద్దులతో కూడిన బడ్జెట్ సెషన్ బదులు రెండు సెషన్‌లను అటూ ఇటూ కుదించి కలిపేసి ముగిస్తే మంచిదని ప్రభుత్వం భావిస్తోన్నట్లు అనధికార వర్గాలు తెలిపాయి. 

వర్షాకాల పార్లమెంట్ సెషన్ సెప్టెంబర్ 14 నుంచి ఆరంభం అయింది. కరోనా తీవ్రతలు లాక్‌డౌన్‌ల నేపథ్యంలోనే ఇది సాగింది. అయితే సెషన్‌కు ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయి. భారీ స్థాయిలో శానిటైజేషన్ , సీట్ల మధ్య దూరాలు చివరికి సభలకు షిఫ్ట్ పద్ధతులు కూడా వెలిశాయి. 

అయితే అన్నీ జరిగినా ఈ దశలో పలువురు ఎంపిలు, సిబ్బంది, చివరికి మంత్రులు కూడా కోవిడ్ బారిన పడ్డారు. దీనిని దృష్టిలో పెట్టుకుని సెషన్‌ను షెడ్యూల్ కన్నా ఎనిమిది రోజుల ముందే సెప్టెంబర్ 24న ముగించి వేశారు.