వైసీపీ, టీడీపీ మత రాజకీయాలు  

అబ్దుల్‌ సలాం కేసులో వైసీపీ, టీడీపీ మత రాజకీయాలు చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. ముస్లింలు కోరగానే డ్యూటీ చేసే పోలీసులను సీఎం జగన్‌ అరెస్టు చేయిస్తుంటే, టీడీపీ అధినేత చంద్రబాబు ముస్లింలను సమీకరించి ఉద్యమాలు చేస్తున్నారని విమర్శించారు. 

తిరుమలలో అక్రమాలు, అంతర్వేది రథం ఘటనలపై బీజేపీ ప్రశ్నిస్తే.. మతతత్వ పార్టీ అన్నవారు.. ఇప్పుడు చేస్తున్నది ఏంటని సోము ప్రశ్నించారు. నంద్యాలలోని బంగారం దుకాణంలో ఏదో వ్యవహా రంలో సలాం ఉన్నాడని ఫిర్యాదు రావడంతో పోలీసులు విచారించారని గుర్తు చేశారు. 

ఆ తర్వాత సలాం నడుపుతున్న ఆటోలో ప్రయాణికుల డబ్బులు పోయినట్టు ఫిర్యాదు వచ్చింది. పోలీసులు విచారించి పంపేశారు. ఆ తర్వాత ఆయన కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు. కొందరు ముస్లింలు చర్య తీసుకోవాలనగానే పోలీసుల్ని అరెస్టు చేసి జైలుకు పంపారని సోము ఆగ్రహం వ్యక్తం చేశారు.

 ‘‘వైసీపీ, టీడీపీలకు ముస్లింల ఓట్లు కావాలి. హిందువులెవరూ ఓటర్లు కాదు. టీడీపీ, వైసీపీలకు ముస్లిం ఓట్లు చాలా? మనమెవ్వరం మనుషులం కాదా? రాష్ట్రంలో హిందువులు, ఇతర కులాలు వద్దు. ఎంత దారుణం!’’ అని వీర్రాజు ధ్వజమెత్తారు. 

కాగా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వమే పూర్తి చేస్తుందని, ప్రాజెక్టు ఎత్తును ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గించేది లేదని సోము వీర్రాజు  భరోసా ఇచ్చారు. జలవనరుల మంత్రి అనిల్‌కుమార్‌.. అప్పుడు వైఎస్‌ ప్రారంభించిన ప్రాజెక్టును ఇప్పుడు జగన్‌ పూర్తి చేస్తారని చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.

పట్టిసీమలో బకెట్‌ మట్టి తీసి రూ.3 లక్షలు తీసుకున్న మేఘా కృష్ణారెడ్డి ఇప్పుడు వైసీపీ ప్రభుత్వానికి ఆణిముత్యం ఎలా అయ్యారని ప్రశ్నించారు.

కాగా, రాష్ట్రంలో ఎర్రచందనం అక్రమ రవాణా జోరుగా సాగు తోందని వీర్రాజు విమర్శించారు. తుంగభద్రలో పుష్కర స్నానాలు చేయవద్దంటున్న ప్రభుత్వం.. రూ.200 కోట్లను ఎవరి కోసం ఖర్చు చేసిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు.