జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కూడా దుబ్బాక ఫలితం 

దుబ్బాక ఫలితం జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పునరావృతం కాబోతోందని  బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన  ఎం.రఘునందన్‌రావు భరోసా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల తర్వాత మంత్రి కేటీఆర్‌ నేలపైకి దిగిరాక తప్పదని జోస్యం చెప్పారు. 
 
తెలంగాణ జర్నలిస్ట్స్‌ యూనియన్‌ నిర్వహించిన ‘మీట్‌ ద ప్రెస్‌’లో రఘునందన్‌ మాట్లాడుతూ దుబ్బాకలో రెండేళ్ల వ్యవధిలోనే టీఆర్‌ఎస్‌ ఓటుబ్యాంకు 65 వేలకు పైగా తగ్గడాన్ని బట్టే ఆ పార్టీ పట్ల ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో తెలిసిపోతోందని గుర్తు చేశారు. 
 
హైదరాబాద్‌లో వరదసాయాన్ని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఓట్ల కొనుగోలుగా మార్చిందని రఘునందన్‌ ఆరోపించారు. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం రూ.2 లక్షల కన్నా ఎక్కువ నగదు డ్రా చేయడానికి వీల్లేదని, కానీ.. జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్లు వరద బాధితుల కోసమంటూ లక్షల రూపాయలు డ్రా చేశారని తెలిపారు. దీనిపై వారిని కోర్టుకీడుస్తామని చెప్పారు. 
 
టీఆర్‌ఎస్‌లో కనీసం 40 మంది ఉద్యమకారులకు అవమానం జరిగిందని చెబుతూ వారంతా అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ల కంటే వారు గొప్ప ఉద్యమకారులని పేర్కొంటూ వారంతా తమతో కలసి రావాలని ఆహ్వానం పలికారు. 
 
దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా తమపై ప్రతి చోటా తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. ఒక వజ్రాన్ని కోయాలంటే మరో వజ్రమే కావాలంటూ 2013లో తనను టీఆర్‌ఎస్‌ నుంచి సస్పెండ్‌ చేసినప్పుడు ఆ పార్టీ అధ్యక్షుడు, ప్రస్తుత సీఎం కేసీఆర్‌పై తాను చేసిన వ్యాఖ్యకు కట్టుబడి ఉన్నానని రఘునందన్‌ స్పష్టం చేశారు.
‘నా నల్లకోటు.. కేసీఆర్‌ను ఎక్కడకు పంపాలో అక్కడకు పంపుతుంది’ అని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని,  దీనికి సంబంధించి కొంత సమాచారం వచ్చిందని చెప్పారు. దుబ్బాక బస్టాండు నిధుల గోల్‌మాల్‌ వ్యవహారం త్వరలో బయటకు వస్తుందని స్పష్టం చేశారు.
దుబ్బాకలో విజయం ద్వారా మంత్రి హరీశ్‌ను పరోక్షంగా ఓడించిన బీజేపీ.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కూడా గెలిస్తే మంత్రి కేటీఆర్‌పై విజయం సాధించినట్లుగా భావిస్తారా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. తమ లక్ష్యం బావబామ్మర్దులు కాదని, భాగ్యనగరంలో మేయర్‌ స్థానమని స్పష్టం చేశారు.

దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి కోసం సిద్దిపేటతో సమానంగా నిధులు తెచ్చుకుని తీరుతానని పేర్కొన్నారు. అన్ని నియోజకవర్గాలకు ఒకేలా నిధులివ్వాలని గతంలో ఉమ్మడి ఏపీ ప్రభుత్వాన్ని మంత్రి హరీశ్‌రావు డిమాండ్‌ చేశారని గుర్తు చేశారు.  ఇప్పుడు అదే విధానం అమలు చేయాల్సిందిగా పట్టుబడతానని తెలిపారు.