డిసెంబర్ 1న జీహెచ్ఎంసీ పోలింగ్ 

జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్  మంగళవారం విడుదలైంది. ఎన్నికల కమిషనర్ పార్థసారధి షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుధవారం నుంచే జీహెచ్ఎంసీ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. 

డిసెంబర్ 1న గ్రేటర్ ఎన్నికల పోలింగ్ జరుగుతుందని, 4న ఓట్ల లెక్కింపు.. అదే రోజు ఫలితాలు వెల్లడించడం జరుగుతుందని ప్రకటించారు. నవంబర్ 20వ తేదీ నామినేషన్లకు చివరి రోజని, 21న పరిశీలన జరుగుతుందని, నామినేషన్ల ఉపసంహరణకు 24 చివరి తేదీ అని పార్థసారథి ప్రకటించారు.

జీహెచ్ఎంసీ ఎన్నికలకు దేశవ్యాప్తంగా ప్రాధాన్యత ఉందని ఎన్నికల కమిషనర్ పార్ధసారథి వ్యాఖ్యానించారు. చట్ట ప్రకారమే ఎన్నికల నిర్వహణ జరుగుతుందని చెప్పారు. ఇప్పటికే ఎన్నికల కసరత్తు పూర్తి చేసినట్లు చెప్పారు. గత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని పార్ధసారథి వెల్లడించారు.

జీహెచ్‌ఎంసీలో 74,04, 286  మంది ఓటర్లు ఉండగా.. 38,56,770 పురుష, 35,46,847 మహిళా ఓటర్లు, 669 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. ఎన్నికల కోసం గ్రేటర్‌ పరిధిలో 9248 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 

ఎన్నికలు బ్యాలెట్‌ పద్ధతిలోనే జరుగుతాయని, అలాగే ఈ ఓటింగ్‌ విధానం ప్రవేశపెట్టనున్నట్లు ఎన్నికల కమిషనర్‌ తెలిపారు. పోలింగ్‌ కేంద్రాల్లో ఫేస్‌ రికగ్నైజేషన్‌తో ఓటర్ల గుర్తింపు ప్రక్రియ చేపట్టనున్నారు. డిసెంబర్‌ 6 లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని అన్నారు. మొత్తం 14 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని చెప్పారు