తిరుపతి లోక్‌సభ టిడిపి అభ్యర్థిగా పనబాక లక్ష్మీ 

పార్టీ అభ్యర్థుల విషయంలో గాని, పదవుల పంపిణీలో గాని చివరి క్షణం వరకు నిర్ణయం తీసుకోకుండా తాత్సర్యం చేస్తుండే టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అందరికి ఆశ్చర్యం కలిగించే రీతిలో  తిరుపతి లోక్‌సభకు ఉపఎన్నికలో పార్టీ అభ్యర్థిని చాల ముందుగా ప్రకటించారు. గత ఎన్నికలలో పోటీ చేసి ఓటమి చెందిన కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మీ పేరును వీడియో కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు వెల్లడించారు.
 
ఇప్పటి వరకు ఎన్నికల షెడ్య్హుల్ ను ప్రకటించలేదు. వచ్చే ఏడాది ఫిబ్రవరి ప్రాంతంలో ఉండవచ్చని అనుకొంటున్నారు. ఆమె బిజెపి అభ్యర్థిత్వం కోసం ప్రయత్నం చేస్తున్నారని వార్త కధనాలు వెలువడుతూ ఉండడంతో ముందు జాగ్రత్తగా ఆయన అభ్యర్థిని ప్రకటించినట్లు కనబడుతున్నది. 
తిరుపతి ఉప ఎన్నికకు సిద్ధం కావాలంటూ వీడియో కాన్ఫరెన్స్‌లో నేతలకు చంద్రబాబు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. తిరుపతిలో లోక్‌సభ మండలాల వారీగా కమిటీలు, వార్డుల వారీగా ఇన్‌చార్జ్‌లు, లోక్‌సభ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఇన్‌చార్జ్‌లుగా ఏడుగురు పార్టీ ప్రధాన కార్యదర్శులు నియామకం చేశారు. తక్షణం కమిటీలు పని ప్రారంభించాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
ఇటీవల తిరుపతి వైసీపీ ఎంపీ దుర్గాప్రసాద్ అనారోగ్యంతో మృతిచెందారు. దీంతో తిరుపతి పార్లమెంట్ స్థానం ఖాళీ అయింది. త్వరలో ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇప్పటికే తిరుపతిలో తమ సత్తా చాటుతామంటూ బీజేపీ ప్రకటించింది.
దుబ్బాకలో గెలిచినట్టుగా తిరుపతిలో కూడా గెలుస్తామంటూ ఏపీ బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దానితో టిడిపి అధినేత ముందు జాగ్రత్తగా అభ్యర్థిని ప్రకటించినట్లు భావిస్తున్నారు. ఇక అధికార పార్టీకి చెందిన అభ్యర్థిని వైసీపీ అధిష్టానం ఇంకా ఖరారు చేయలేదు.