దుబ్బాకతో జీహెచ్‌ఎంసీ ఆస్తి పన్నులో 50శాతం రాయితీ

తమకు కంచుకోటగా భావించే దుబ్బాకలో బిజెపి అభ్యర్థి గెలుపొందడం తెలంగాణ అధికార పక్షం టి ఆర్ ఎస్ కలవరానికి గురవుతున్నట్లు కనిపిస్తున్నది. దీని ప్రభావం త్వరలో జరిగే గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై ఉండే అవకాశం ఉన్నట్లు ఆందోళన చెందుతున్నది. 
 
ఇప్పటికే దుబ్బాక తర్వాత తమ దృష్టి అంతా జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై అని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఇప్పటికే ప్రకటించారు. ఇక్కడ కూడా బిజెపి గెలుపొందితే ఇక రాష్ట్రంలో తమ పరిపాలనకు ముగింపు పలికిన్నట్లే కాగలదని ఆందోళన అధికార పక్షంలో కనిపిస్తున్నది. 
 
అందుకనే ఒక వంక బిజెపి ఎన్నికలకు సిద్ధం కాకముందే హడావుడిగా గ్రేటర్ హైదరాబాద్ లో ఎన్నికలు జరిపే ప్రయత్నం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మరో వంక నగర వాసులను ప్రసన్నం చేసుకోవడం కోసం దీపావళి కానుకగా  జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆస్తి పన్నులో 50శాతం రాయితీ ఇస్తున్నట్టు కేటీఆర్ వెల్లడించారు. 
 
ఇది రూ.15 వేల వరకు ఆస్తిపన్ను కట్టిన వారికి వర్తించనుందని తెలిపారు. ఇతర ప్రాంతాల్లో రూ.10 వేలలోపు ఆస్తి పన్నుకట్టే వారికి వర్తించనుందని వెల్లడించారు. దీని వల్ల హైదరాబాద్‌లో 13 లక్షల 72 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని తెలిపారు. ఆస్తి పన్నులో రాయితీతో రాష్ట్రంపై రూ.130 కోట్ల భారం పడిందని పేర్కొన్నారు.
 
డిసెంబర్ మొదటి వారంలోనే జీహెచ్‌ఎంసీ  
ఎన్నికలు జరుగుతాయని రెండు, మూడు రోజులుగా మీడియాలో తీవ్రంగా ప్రచారం జరుగుతూ ఉండగా జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు తొందర పడాల్సిన అవసరం లేదని అంటూ కేటీఆర్ పైకి గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. 
 
ఒక విధంగా ఎన్నికలకు ఇప్పుడే వెళ్లాలా, మరోకొంత కాలం ఆగాలా అనే సందిగ్దత అధికార పక్షంలో కనిపిస్తున్నది. భారీ వర్షాలకు నష్టాలకు గురైన వారికి రూ 10,000 చొప్పున చేపట్టిన నగదు పంపిణి కార్యక్రమం అభాసుపాలు కావడంతో పలు కానీలలో ప్రజలు తీవ్ర ఆగ్రవేశాలు వ్యక్తం చేస్తున్నారు.
అధికార పక్షంకు చెందిన ప్రజా ప్రతినిధులను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ఆర్ధిక సహాయాన్ని టి ఆర్ ఎస్ కార్యకర్తలకే పంచారని,  నిజమైన బాధితులకు పంచిన మొత్తంలో కూడా కొంత భాగం స్వాహా చేశారని బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు.
 
ఇటువంటి సమయంలో ఎన్నికలు జరపడం ఆత్మహత్య సాదృశ్యం కాగలదని అధికార పక్ష ఎమ్యెల్యేలు, ఇతర స్థానిక నాయకులు ఆందోళన చెందుతున్నారు. దానితో నగర ప్రజలను ప్రసన్నం చేసుకోవడం పట్ల దృష్టి సారించినట్లు కనిపిస్తున్నది. దీపావళిని పురస్కరించుకొని పారిశుద్ధ్య కార్మికుల జీతాలు రూ.14,500 నుంచి రూ.17,500కి పెంపుదల చేస్తున్నట్లు కూడా కేటీఆర్ ప్రకటించడం గమనార్హం. 
 
దుబ్బాకలో వలే గత ఎన్నికల హామీల అమలులో కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రధాన ఎన్నికల అస్త్రంగా చేసుకోవాలని హైదరాబాద్ లో కూడా బిజెపి సన్నద్ధం అవుతూ ఉండడంతో అధికార పక్షంలో అలజడి మొదలైన్నట్లు కనిపిస్తున్నది.