ఎంఐఎంకు మేయర్ పదవి ఇవ్వనున్న టీఆర్‌ఎస్ !  

హైదరాబాద్ నగరాన్ని ఎంఐఎంకు ధారాదత్తం చేసేందుకు అధికారి పార్టీ టీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తోందిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు.   దుబ్బాక ప్రజలు గుణపాఠం చెప్పినా టీఆర్‌ఎస్‌కు బుద్దిరాలేదని విమర్శించారు.

ఎంఐఎంకు మేయర్‌ పదవి కట్టబెట్టేందుకు టీఆర్‌ఎస్‌ లోపాయికారి ఒప్పందం చేసుకుందని ధ్వజమెత్తారు. 63 డివిజన్‌లలో హిందువుల ఓట్లు తగ్గించి మైనార్టీ ఓట్లు పెంచారని చెప్పారు.

ఆధారాలతో సహా ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసిందని తెలిపారు. అయితే ఎన్నికల సంఘం అభ్యంతరాలను స్వీకరించి పరిష్కరించిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని, కానీ అలా జరగడం లేవని విమర్శించారు.

 రాష్ట్ర ఎన్నికల సంఘం టీఆర్‌ఎస్‌ చేతిలో కీలుబొమ్మగా మారిందని సంజయ్ మండిపడ్డారు. ఎంఐఎం చెబితే టీఆర్‌ఎస్‌, టీఆర్‌ఎస్‌ చెబితే ఎన్నికల సంఘం వింటుందని దుయ్యబట్టారు. 
 
ఎంఐఎంకు మేయర్‌ పదవి దక్కుండా చూస్తామని స్పష్టం చేశారు.  బీజేపీ 100 స్థానాల్లో గెలిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎంఐఎం, టీఆర్‌ఎస్‌ల నుంచి భాగ్యనగరాన్ని కాపాడుకుంటామని స్పష్టం చేశారు. 
 
బీహార్‌లో ఎంఐఎం 5 ఆసెంబ్లీ స్థానాలు గెలుచుకోవడానికి సీఎం కేసీఆర్‌ ఆర్థిక సాయం చేశారని సంజయ్ ఆరోపించారు. దేశవ్యాప్తంగా ఎంఐఎం విస్తరించేలా కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. 
 
హిందువుల పండగల పట్ల కేసీఆర్  ప్రభుత్వం వివక్షత చూపుతోందని సంజయ్ విమర్శించారు.  దీపావళికి టపాసులు కాల్చకుండా నిషేధించడం హిందువుల పండగలను చూలకన చేయడమే అని బండి సంజయ్‌ స్పష్టం చేశారు.