స్వరూపానందకు రాజమర్యాదలపై వివాదం 

దేవాలయాలు, హిందువుల మనోభావాలకు అవమానం కలిగించే విధంగా వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్న సమయంలో శారదా పీఠాధిపతి స్వరూపానందకు అందిస్తున్న రాజమర్యాదలు తాజాగా వివాదాస్పదం అవుతున్నాయి.  
 
18వ తేదీన శారదా పీఠాధిపతి స్వరూపానంద జన్మదిన వేడుకల సందర్భంగా ప్రత్యేక ఆలయ మర్యాదలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి ఏపీలోని అన్ని ప్రముఖ దేవస్థానాలకు దేవాదాయ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ విధంగా ఒక వ్యక్తి జన్మదివ వేడుకలపై ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం గతంలో ఎన్నడూ జరుగనే లేదు. 
 
ఇటీవల స్వరూపానంద, పీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్రలకు టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి, పాలకమండలి సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి రేణిగుంట ఎయిర్‌పోర్టులో స్వాగతం పలికారు. అక్కడి నుంచి వారిని తిరుమల తీసుకువెళ్లారు.
 
 ఓ పీఠాధిపతికి అదనపు ఈవో, పాలకమండలి సభ్యుడు స్వాగతం పలికాడంపై విమర్శలు వచ్చాయి. ఈ విమర్శల నుంచి ప్రభుత్వం బయటపడకముందు ఇప్పుడు కూడా స్వరూపానంద విషయంలో మరో వివాదాస్పద ఆదేశాలు చేసి ప్రభుత్వం అభాసుపాలయింది.  గతంలో కూడా శ్రీవారి దర్శనానికి వచ్చిన విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్రకుఏకంగా అలిపిరికి వెళ్లి మరీ స్వాగతం పలకడం వివాదం రేపింది.
ఎంత పెద్ద పీఠాధిపతి అయినా, ముఖ్యమంత్రి, ప్రధాని, రాష్ట్రపతిలాంటి ప్రముఖలకైనా తిరుమలలోనే అధికారులు స్వాగతం పలుకుతారు. అదే ఆచారం, సంప్రదాయం! కానీ స్వరూపానందకు టీటీడీ ఉన్నతాధికారులతోపాటు పలువురు జిల్లా అధికారులు అలిపిరి వద్దే స్వాగతం పలికారు.