లక్షల దీపాల వెలుగులతో దేద్దీప్యమానంగా అయోధ్య 

లక్షల దీపాల వెలుగులతో దేద్దీప్యమానంగా అయోధ్య 
అయోధ్యకు దీపావళి ముందుగానే వచ్చింది. లక్షల దీపాల వెలుగులతో అయోధ్య రామమందిరం దేద్దీప్యమానంగా వెలిగిపోతోంది. అయోధ్య రామ జన్మభూమి న్యాస్‌లో దీపావళి సందర్భంగా తొలిసారి దీపోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
 
ఈ వేడుక సందర్భంగా సరయూ నది ఒడ్డున 5లక్షలకు పైగా దీపాలను వెలిగించారు. ఈ దీపాలను ఓ క్రమ పద్ధతిలో అమర్చి రామ్‌చరిత్ మానస్‌లోని విషయాలకు దృశ్యరూపం కల్పించారు. ఇలాంటి దృశ్యాలను మొత్తం 11 సృజించారు. 
 
అంతేకాకుండా లలిత్ కాలా అకాడమీకి చెందిన కళాకారులు కూడా ఈ వేడుక కోసం శ్రీరాముడి రూపాలను ప్రత్యేకంగా రూపొందించారు. రామాయణంలోని పలు దృశ్యాలకు సంబంధించిన 25 రాముడి రూపాలను ఇక్కడ ప్రతిష్ఠించారు.
 
ఇదిలా ఉంటే ఇన్ని దీపాలను ఒకేచోట వెలిగించడంతో ఈ వేడుకకు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా లభించింది. ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ ప్రత్యేక అతిథిగా హాజరై పూజలు నిర్వహించారు. హారతి కార్యక్రమం నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, ఇంత గొప్ప కార్యక్రమానికి అతిథిగా హాజరుకావడం, అందులోనూ తానే హారతి కార్యక్రమం నిర్వహించనుండడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.  
 
ఈ వేడుక నిర్వహణలో పాల్గొన్న వారంతా పూర్తిగా కరోనా నిబంధలను పాటించారని ఆయన చెప్పారు. దీపోత్సవ్-2020 కార్యక్రమం కోసం రామ జన్మభూమిలో మొత్తం 5,84,572 దీపాలను వెలిగించినట్లు ఆయన తెలిపారు. 
 
దీపోత్సవ్-2020 కార్యక్రమానికి హాజరు కాలేకపోయిన లక్షల మంది ప్రజలు వర్చువల్ విధానంలో దీపం వెలిగించినట్లు సీఎం యోగి తెలిపారు.