పాక్ సేనలపై అగ్ని వర్షం… 8 మంది హతం 

ఎల్‌ఓసీ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ బరితెగించిన పాక్ రేంజర్లకు భారత బలగాలు శుక్రవారంనాడు గట్టిగా బదులిచ్చాయి. భారత బలగాల ప్రతికాల్పుల్లో 8 మంది పాక్ సైనికులు హతమయ్యారు.
వీరిలో ఇద్దరు నుంచి ముగ్గురు వరకూ ఆర్మీ స్పెషల్ సర్వీస్ గ్రూప్ (ఎస్ఎస్‌జీ)  కమెండోలు ఉన్నట్టు భారత ఆర్మీ వర్గాలను ఉటంకిస్తూ ‘ఏఎన్ఐ’ వార్తాసంస్థ పేర్కొంది. ఆ కథనం ప్రకారం,  భారత ఆర్మీ ప్రతికాల్పుల్లో 10 నుంచి 12 మంది వరకూ పాక్ సైనికులు గాయపడ్డారు. పెద్దఎత్తున ఆర్మీ బంగర్లు, ఇంధన డంప్‌లు, లాంచ్‌ ప్యాడ్లను కూడా భారత బలగాలు ధ్వంసం చేశాయి.
కాగా, ఎల్ఓసీ వెంబడి పాక్ బలగాలు ఎలాంటి కవ్వింపులు లేకుండానే పలుచోట్ల కాల్పులతో శుక్రవారంనాడు తెగబడ్డాయి.  చొరబాటుకు పన్నిన కుట్రలో భాగంగా పాక్  బాంబుల వర్షం కురిపించింది. ప్రజల నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని రక్తపాతం సృష్టించింది.
పాక్‌ దొంగదెబ్బను దీటుగా తిప్పికొడుతూ బీఎస్‌ఎఫ్‌ ఎస్సై, నలుగురు సైనికులు వీరమరణం పొందా రు. ఐదుగురు పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు భద్రతా సిబ్బంది, ఎనిమిది మంది పౌరులు గాయపడ్డారు. పాక్‌ దుశ్చర్యకు భారత్‌ సైన్యం గట్టిగా బదులిచ్చింది.
నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వెంబడి పాక్‌ స్థావరాలపై గురిపెట్టి మిస్సైళ్లు, రాకెట్లతో విరుచుకుపడింది. పాక్‌ మందుగుండు, ఇంధన డంప్‌లను, ఉగ్రవాదుల లాంచ్‌పాడ్‌లను ధ్వంసం చేశామని రక్షణ శాఖ ప్రతినిధి కల్నల్‌ రాజేశ్‌ కాలియా శ్రీనగర్‌లో తెలిపారు.
ఎల్‌వోసీ వెంబడి ఉన్న పాక్‌ స్థావరాలను మన సైన్యం క్షిపణులు, రాకెట్లతో ధ్వంసం చేసింది. పాక్‌కు బుద్ధి చెప్పేందుకు ఎలా విరుచుకుపడిందీ తెలియజేసే కొన్ని వీడియోలను సైన్యం బహిరంగపరిచింది. ఎల్‌వోసీ వెంబడి ఉన్న పాక్‌ బంకర్లతో పాటు పాక్‌ మందుగుండు, ఇంధన నిల్వలు ఉంచిన భవనాలను యాంటీ-ట్యాంక్‌ గైడెడ్‌ క్షిపణులు, రాకెట్లు ధ్వంసం చేస్తున్న దృశ్యాలు ఆ వీడియోల్లో ఉన్నాయి. బంకర్‌ లక్ష్యంగా భారత్‌ ఒక క్షిపణిని ప్రయోగించగా ప్రాణాలు కాపాడుకోవడానికి పాక్‌ సైనికులు పారిపోతున్న దృశ్యం మరో వీడియోలో ఉంది.