‘విస్తరణవాద కాంక్ష’ ఓ మానసిక రుగ్మత

 
 విస్తరణవాదం అనేది ఓ మానసిక రుగ్మత అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చైనాపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ‘‘విస్తరణ వాదం ఓ మానసిక రుగ్మత. ఈ విస్తరణ వాదులతో ప్రపంచంలో సమస్యలు తలెత్తుతున్నాయ్. 18 వ శతాబ్దపు పోకడలు ఇందులో కనిపిస్తున్నాయ్. విస్తరణ వాదానికి వ్యతిరేకంగా భారత్ కూడా బలమైన గొంతుకను వినిపిస్తోంది.’’ అని మోదీ పేర్కొన్నారు.
 
రాజస్థాన్ రాష్ట్రం  జైసల్మేర్‌లోని జవాన్లతో కలిసి ప్రధాని మోదీ దీపావళి పర్వదినాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వారి వారి ఇళ్లలోకే నేరుగా చొరబడి అనేక మంది ఉగ్రవాదులను, ఉగ్రవాద నేతలను మట్టుబెట్టామని, దేశ ప్రయోజనాల విషయంలో భారత్ రాజీపడదన్న విషయాన్ని ప్రపంచం ఇప్పుడు అర్థం చేసుకుందని తెలిపారు. 
 
దేశానికి ఈ ఖ్యాతి వచ్చిందంటే అది జవాన్ల శౌర్యం వల్ల మాత్రమే వచ్చిందని మోదీ ప్రశంసించారు. కొత్త కొత్త ఆవిష్కరణతో జవాన్లు తమ చాతుర్యాన్ని, విజ్ఞానాన్ని ప్రదర్శించాలని, యోగాను బాగా సాధన చేయాలని సూచించారు. అంతేకాకుండా మాతృభాష, ఆంగ్లంతో పాటు మరో కొత్త భాషను కూడా జవాన్లందరూ నేర్చుకోవాలని సూచించారు. 
 
ఈ మూడు విషయాలను సాధన చేయడం ద్వారా నూతన దృక్పథాలు అలవడతాయని, ఉత్సాహం నిబిడీకృతమవుతుందని ఆయన సూచించారు. 
 
  కరోనా కారణంగా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని తిరిగి తీసుకురావడంలో భారత వైమాని దళం, నావికా దళం చేసిన కృషి ప్రశంసనీయమని ప్రధాని మోదీ కొనియాడారు. కేవలం శత్రువులతో పోరాడే సామర్థ్యాన్నే కలిగి ఉండటం కాకుండా, విపత్తుల సమయంలో ప్రజలకు సహాయం చేయడంలోనూ సాయుధ దళాలు ముందున్నాయని ఆయన ప్రశంసించారు. 
 
‘‘కరోనా సమయంలో భద్రతా బలగాలు యుద్ధ ప్రాతిపదికన సేవలందించాయి. మాస్కులు, శానిటైజర్లు, పీపీఈ కిట్లు, మెడికల్ తదితర వస్తువులను అందించడంలో చాలా సమర్థవంతంగా సేవలందించాయి.’’ అని మోదీ అభినందించారు. భారత్ పెద్ద పెద్ద దేశాలతో సైనిక విన్యాసాలు కూడా చేస్తోందని గుర్తు చేశారు. 
 
“తీవ్రవాదానికి వ్యతిరేకంగా వ్యూహాత్మకంగా వ్యవహరించే దేశాలతోనూ కలిసి పనిచేస్తున్నాం. ప్రపంచంలో ఉగ్రవాద స్థావరాలు ఏ మూలన ఉన్నా… లేపేసే సత్తా భారత ఆర్మీకి ఉంది.’’ అని మోదీ స్పష్టం చేశారు. భారత భూభాగంపై ఎవరు కన్నేసినా… వారికి దీటైన సమాధానం చెప్పే సత్తా కూడా భారత ఆర్మీకి ఉందని ప్రధాని మోదీ పరోక్షంగా పొరుగు దేశాలను హెచ్చరించారు. 
 
“మీరు మంచుకొండ‌ల‌పైన‌, ఎడారుల్లో దేశం కోసం శ్రమిస్తున్నారు. మీతో క‌లిసిన త‌ర్వాతే నాకు దీపావ‌ళి పూర్త‌వుతుంది. మీరు ముఖాల్లో సంతోషం చూసిన‌ప్పుడు నా ఆనందం రెట్టింప‌వుతుంది. 130 కోట్ల మంది భారతీయులు మీతో ఉన్నారు. మీ ప‌రాక్ర‌మాన్ని చూసి వారు గ‌ర్వ‌ప‌డుతున్నారు. ప్ర‌పంచంలోని ఏ శ‌క్తికి కూడా స‌రిహ‌ద్దుల్లో మిమ్మ‌ల్ని ఎదిరించే స‌త్తాలేదు” అంటూ వారిని ప్రోత్సహించారు. 
 
  న‌రేంద్ర‌మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రతి ఏడాది దీపావళి వేడుకలు దైశ సైనికులతో జరుపుకోవడం ఆనవాయితిగా వస్తోంది. గతేడాది జమ్ముకశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో దీపావళి వేడుకల్లో పాల్గొనగా, 2018లో ఉత్తరాఖండ్‌ సరిహద్దు సైనికులతో కలిసి మోదీ దీపావళి పండుగ జరుపుకున్నారు. 2017లోనూ ఉత్తర కశ్మీర్‌లోని గురేజ్ సెక్టార్‌లో సైనికులతో కలిసి ప్రధాని మోదీ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.