జెపి నడ్డా 100 రోజుల దేశ వ్యాప్త పర్యటన 

2024 సార్వత్రిక ఎన్నికల సన్నాహాల కోసం బిజెపిని బలోపేతం చేసేందుకు దేశవ్యాప్తంగా పర్యటించనున్నట్లు బిజెపి అధ్యక్షుడు జెపి.నడ్డా తెలిపారు. ‘రాష్ట్రీయ విస్త్రిత్‌ ప్రవాస్‌’ పేరుతో వంద రోజుల పాటు పర్యటించనున్నారు. 
 
2019లో పార్టీ అపజయం పాలైన స్థానాల్లో కూడా బలోపేతం చేసేందుకు, 2024లో ఆ సీట్లను ఎలా గెలుచుకోవాలనే దానిపై ప్రణాళిక రూపొందించేందుకు ఈ పర్యటనలో ప్రాధాన్యతనివ్వనున్నట్లు తెలిపారు. ఇటీవల బీహార్‌ ఎన్నికల్లో విజయం సాధించడంపై ప్రధాని మోడీ నడ్డాను ప్రశంసించిన సంగతి తెలిసిందే. 
 
పార్టీ ప్రజా ప్రతినిధులతో సమావేశమవడం, కొత్త కూటములపై చర్చించడం, బిజెపి పాలిత ప్రాంతాల ప్రతిష్టను మరింత ఇనుమడించేలా చర్యలు తీసుకోవడం, కేడర్‌లో పార్టీ భావజాలంపై స్పష్టత తీసుకురావడం, పార్టీలోని సీనియర్‌ కార్యకర్తలు, సంకీర్ణ భాగస్వామ్యులతో చర్చలు ప్రారంభించడం వంటివి చేయనున్నారు. 
 
కరోనా వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్నందున ఈ పర్యటనల్లో ప్రతి రాష్ట్రంలోనూ కేవలం 200 మందితో మాత్రమే సమావేశమవనున్నట్లు తెలిపారు.