వరవరరావుకు మళ్ళి బెయిల్ నిరాకరణ 

బీమా కోరేగావ్ కేసులో రెండేళ్ల నుంచి జైలులో ఉంటున్న విప్ల‌వ ర‌చయిత వ‌ర‌వ‌ర‌రావుకు బెయిల్ ఇచ్చేందుకు  బాంబే హైకోర్టు మరోసారి నిరాక‌రించింది. క్షీణిస్తున్న ఆరోగ్యం దృష్ట్యా వ‌ర‌వ‌ర‌రావుకు బెయిల్ మంజూరీ చేయాలంటూ ఆయ‌న కుటుంబ‌స‌భ్యులు కోర్టును కోరారు. 
 
అయితే వీడియో కాల్ ద్వారా డాక్ట‌ర్లు వ‌ర‌వ‌ర‌రావును ప‌రీక్షిస్తార‌ని, అవ‌స‌రం అయితే ఆయ‌న్ను వారు ప‌ర్స‌న‌ల్‌గా విజిట్ చేస్తార‌ని కోర్టు త‌న తీర్పులో పేర్కొన్న‌ది. వ‌ర‌వ‌ర‌రావు కుటుంబం త‌ర‌పున న్యాయ‌వాది ఇందిరా జైసింగ్ వాదించారు.  
 
క‌వి వ‌ర‌వ‌ర‌రావు మంచానికే ప‌రిమితం అయ్యార‌ని, ఆయ‌న డైప‌ర్స్‌పై ఉన్నార‌ని,  మూత్రాన్ని ఆపుకోలేక‌పోతున్నార‌ని, ఇలాంటి వ్య‌క్తి ఎక్క‌డికి పారిపోగ‌ల‌డ‌ని న్యాయ‌వాది జైసింగ్ కోర్టులో వాదించారు. 
 
అయితే వ‌ర‌వ‌ర‌రావుతో వీడియో కాల్ ఏర్పాటు చేయాల‌ని, ఈ కేసును మ‌ళ్లీ న‌వంబ‌ర్ 17వ తేదీన విచారించాల‌ని బాంబే హైకోర్టు పేర్కొన్న‌ది.నానావ‌తి హాస్పిట‌ల్ డాక్ట‌ర్ల‌తో వీడియో కాల్ ఏర్పాటు చేయాల‌ని కోర్టు చెప్పింది. 
 
వరవరరావును ఉగ్రవాద వ్యతిరేక చట్టం, చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం కింద 2018 జనవరిలో ఎన్‌ఐఎ అదుపులోకి తీసుకుంది.ప్ర‌స్తుతం ముంబైలోని త‌లోజా జైలులో వ‌ర‌వ‌ర‌రావు ఉన్నారు.