తెలంగాణలో బాణసంచా నిషేధంపై వ్యాపారుల ఆందోళన

దీపావళి పండుగ నేపథ్యంలో తెలంగాణలో బాణసంచాను నిషేధించాలని ప్రభుత్వానికి రాష్ట్ర హైకోర్టు ఆదేశించడం పట్ల క్రాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఏటా దీపావళి పండుగ సందర్భంగా 2 వందల కోట్ల రూపాయల క్రాకర్స్ టర్నోవర్ జరుగుతుందని తెలిపారు. 50 ఏళ్ల నుంచి ఈ వ్యాపారం చేస్తున్నామని తెలిపారు. 
 
పటాకులను నిషేధిస్తూ చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు తమను కలచి వేసిందని పేర్కొంటూ అటువంటప్పుడు అగ్నిమాపకదల అనుమతులుతమకు ఎందుకు ఇచ్చారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీపావళి సందర్భంగా బాణాసంచాను నిషేధించాలని న్యాయవాది ఇంద్ర ప్రకాశ్‌ హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు.
కరోనా పరిస్థితుల్లో కాలుష్యం పెరిగి తీవ్ర ప్రభావం చూపుతుందని పిటిషన్‌ పేర్కొన్నారు. సుప్రీం కోర్టు, పలు హైకోర్టులు రాష్ట్రాలు నిషేధం విధించాయని కోర్టుకు తెలిపారు. అయితే బాణాసంచాపై నిర్ధిష్ట పాలసీ రూపొందించలేదని, ఎన్టీసీ మార్గదర్శకాలు పాటిస్తామని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
బాణాసంచాపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తూ నిషేధంపై విస్తృత ప్రచారం చేయాలని హైకోర్టు  ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా ఇప్పటి వరకు తెరిచిన బాణాసంచా షాపులను మూసివేయాలని ఆదేశించింది. ఎవరైనా అమ్మకాలు జరిపితే కేసులు నమోదు చేయాలని, ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఈ నెల 19న తెలపాలని హైకోర్టు తెలిపింది.
 
అయితే హైకోర్టు తీర్పు హోల్ సేల్ వ్యాపారులకు ఆరు నెలల కింద చెప్పి ఇచ్చి ఉంటే బాగుండేదని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. రెండు రోజులు పాటు అమ్మకాలకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేసిన అసోసియేషన్ సభ్యులు తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో తమను ఆదుకోవాలని కోరారు. 
 
రెండు రోజులు అవకాశం ఇస్తే తమ సరుకు అమ్ముడుపోయి.. అప్పులు తీరుతాయంటున్నారు. లేదంటే ఆత్మహత్యలే తమకు శరణ్యమని క్రాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.